విమాన ప్రయాణికులకు ఇండిగో సంస్థ భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.899 లకే విమాన టికెట్లను అందించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ తాము ప్రకటించిన తేదీల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఇండిగో సంస్థ తెలిపింది. 

బడ్జెట్ ధరల్లో...అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ ఇండిగో విమానయాన సంస్థ మంచి పేరు సంపాందించుకుంది. అందువల్ల దేశంలోని వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగించడానికి చాలా మంది ఈ సంస్థ విమానాలనే ఆశ్రయిస్తుంటారు. ఇలా చౌక ధరలకు టికెట్లు అందిస్తూ ప్రయానికులకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఈ సంస్థ చాలా దగ్గరయ్యింది.

అయితే మధ్యతరగతి ప్రయాణికులను మరింతగా ఆకట్టుకోడానికి ఇండిగో సంస్థ వింటర్ సేల్ పేరుతో కొత్త ఆపర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ వర్తించే నవంబరు 21 నుంచి 25 వ తేదీలోపు బుక్‌ చేసుకున్న టికెట్లలో దేశీయ ప్రయాణానికి కేవలం రూ.899 చార్జ్ చేయనున్నారు. ఇక అంతర్జాతీయ ప్రయాణానికైతే రూ.3199రూపాయలు చార్జ్ చేయనున్నారు. వింటర్ సేల్ ఆఫర్ ద్వారా దాదాపు 10 లక్షల టికెట్లను అమ్మడానికి ప్రణాళిక రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.      

డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ రూట్లలో నాన్‌ స్టాప్‌ విమానాల్లో  మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది.  ఈ ఆపర్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లతో డిసెంబరు 6, 2018 నుంచి  ఏప్రిల్‌ 15, 2019 వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందని ఇండిగో సంస్థ తెలిపింది.