ఎయిర్‌బస్‌కు ఇండిగో భారీ ఆర్డర్ .. 500 విమానాల కొనుగోలుకు ఒప్పందం, డీల్ విలువ అక్షరాలా ..?

ఆకాశాన్ని శాసించేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిద్ధమైంది. ఏకంగా టాటాల రికార్డును చెరిపేస్తూ.. ఒకేసారి 500 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్‌కు ఆర్డర్ ఇచ్చి చరిత్ర సృష్టించింది. ఈ డీల్ విలువ అక్షరాల 50 బిలియన్ డాలర్లు.

IndiGo Places Order For 500 Airbus Neo Family Planes ksp

భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఈరోజు కీలక ప్రకటన చేసింది. 2030 నుంచి 2035 ఏళ్ల మధ్యకాలంలో సంస్థ అవసరాలను దృష్టిలో వుంచుకుని 500 ఎయిర్‌బస్ నియో ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల భారీ ఆర్డర్‌ను ప్రకటించింది. మార్కెట్ అంచనా ప్రకారం.. ఈ డీల్ విలువ అక్షరాల 50 బిలియన్ డాలర్లు. అంతేకాదు.. విమానయాన చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందమని నిపుణులు అంటున్నారు. ప్యారిస్ ఎయిర్ షో 2023లో ఈ డీల్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో ఎయిరిండియా ప్రకటించిన 470 ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఆర్డరే ఇప్పటి వరకు అతిపెద్ద కొనుగోలు డీల్‌గా నిలిచింది. తాజాగా ఇండిగో ఈ రికార్డును అధిగమించింది. 

ఈ 500 ఎయిర్‌క్రాఫ్ట్స్ డీల్ అనేది అతిపెద్ద ఆర్డర్ మాత్రమే కాదు.. ఎయిర్‌బస్‌తో ఏ విమానయాన సంస్థ అయినా చేసుకున్న అతిపెద్ద సింగిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు కూడా. ఈ ఆర్డర్‌కు సంబంధించి ఇంజిన్ ఎంపిక నిర్ణీత సమయంలో జరుగుతుంది. ఈ డీల్‌లో ఏ320, ఏ321 విమానాలు వుంటాయని ఇండిగో తన ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ వాల్యుయేషన్‌పై ఇప్పటికే ఇండిగో బోర్డులో చర్చించి, ఆమోదించబడిందని ఇండిగో తెలిపింది. ఇండిగో సంస్థ భారత్‌లోని దేశీయ విమానయాన మార్కెట్‌లో 60 శాతం వాటాను కలిగి వుంది. 

2030-35 నాటికి 500 ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఆర్డర్ అందితే ఇండిగో దాదాపు 100 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగివున్న సంస్థగా నిలుస్తుంది. ఈ ఇండిగో ఆర్డర్‌లో A320NEO, A321NEO,  A321XLR‌ మోడల్స్ వుంటాయి. ఇండిగో ఆర్డర్ చేసిన ఎయిర్‌బస్‌ విమానాలతో కలిపి.. ఈ సంస్థకు వున్న మొత్తం విమానాల సంఖ్య 1,330కి చేరనుంది. అంతేకాదు.. అతిపెద్ద ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌‌ కస్టమర్‌గా ఇండిగో నిలిచింది. ప్రస్తుతం ఇండిగో 300కు పైగా విమానాలు నడుపుతోంది. గతంలో 480 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చినప్పటికీ.. అవి ఇంకా సంస్థ చేతికి అందలేదు. 

ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ.. 500 ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఆర్డర్ వచ్చే దశాబ్ధకాలంలో భారతదేశ ఆర్ధిక వృద్ధి, సామాజిక సమన్వయానికి దోహదం చేస్తుందన్నారు. ఎయిర్‌బస్‌తో మా సంస్థకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై నమ్మకాన్ని, బలాన్ని తాజా ఆర్డర్ పునరుద్ఘాటిస్తుందన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఎయిర్‌బస్ చీఫ్ కమర్షియల్ అండ్ ఇంటర్నేషనల్ హెడ్ క్రిస్టియన్ షెరర్ మాట్లాడుతూ.. ఇండిగో ఆర్డర్ చారిత్రాత్మకమన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయానంలో మిలియన్ల మందికి సరసమైన విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎయిర్‌బస్ , ఇండిగోల సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. 

ఇండిగోతో తమ దీర్ఘకాల సంబంధాన్ని గౌరవిస్తామని షెరర్ తెలిపారు.  ఈ బలీయమైన భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా దేశీయ , అంతర్జాతీయ మార్కెట్‌లలో భారతదేశ ఎయిర్ కనెక్టివిటీ వృద్ధికి దోహదపడాలని తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఇండిగో-ఎయిర్‌బస్ కొనుగోలు ఒప్పందం ఈరోజు పారిస్ ఎయిర్ షో 2023లో ఇండిగో బోర్డ్ ఛైర్మన్ వి సుమంద్రన్ సమక్షంలో జరిగింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్‌బస్ సీఈవో ఫౌరే‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios