Asianet News TeluguAsianet News Telugu

అనుభవానికి పెద్దపీట: ఇండిగో సీఈఓగా రణజయ్ దత్తా నియామకం

దేశీయ పౌర విమాన యాన సంస్థ ఇండిగో సీఈఓగా అపారమైన అనుభవం గల నిపుణుడు రణజయ్ దత్తాను నియమించింది. 20 ఏళ్లుగా పౌర విమానయాన రంగంలో అపారమైన అనుభవం సంపాదించారాయన. ఇక సంస్థ చైర్మన్‌గా సెబీ మాజీ చైర్మన్ దామోదరన్ నియమితులయ్యారు.

IndiGo owner InterGlobe appoints Ronojoy Dutta as CEO
Author
Hyderabad, First Published Jan 25, 2019, 9:51 AM IST

దేశీయ పౌర విమాన యాన సంస్థ ‘ఇండిగో’ సీఈఓగా విమానయాన రంగంలో ఎంతో అనుభవం ఉన్న రణజయ్‌ దత్తాను నియమించినట్టు ప్రకటించింది. ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. సంస్థ ప్రెసిడెంట్‌గా ఆదిత్య ఘోష్‌ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు ఇండిగో ఈ నియామకం చేపట్టడం గమనార్హం. ఇక, సెబీ మాజీ చైర్మన్‌ ఎం.దామోదరన్‌ను కంపెనీ చైర్మన్‌గా నియమించినట్టు తెలిపింది.

ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్‌ భాటియా నుంచి దత్తా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుందని కంపెనీ తెలిపింది. రణజయ్‌ దత్తా ప్రస్తుతం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 

యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థలో ఆయన 20 ఏళ్ల నుంచి పనిచేస్తూ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ప్లానింగ్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మెయింటెనెన్స్‌), వైస్‌ ప్రెసిడెంట్‌ (ఫైనాన్స్‌), వైస్‌ ప్రెసిడెంట్‌ (ఐటీ) వంటి కీలక పదవులను నిర్వహించారు. ఎయిర్‌ సహారా సంస్థకు ప్రెసిడెంట్‌గా రెండేళ్లు పనిచేశారు. ఎయిర్‌ కెనడా, యూఎస్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలకు అడ్వైజర్‌గానూ వ్యవహరించారు. 

ఇండిగో ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌ సంస్థగా అపూర్వ విజయం సాధించింది. ఈ సంస్థలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అధికంగా వృద్ధి చెందుతున్న సంస్థల్లో ఇండిగో ఒకటి. భవిష్యత్‌లో మరింత వేగంగా వృద్ధిని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి’అని దత్తా పేర్కొన్నారు.

ఇండిగోకు ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ మాతృ సంస్థ. డిసెంబర్‌తో ముగిసిన కాలానికి ఈ సంస్థ నికర లాభం 75 శాతం క్షీణించి రూ.190 కోట్లకు పరిమితమైంది. ఇండిగోకు ప్రెసిడెంట్, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆదిత్య ఘోష్‌ ఇటీవలే హోటల్‌ అగ్రిగేటర్‌ ఓయోలో చేరిన సంగతి తెలిసిందే. 


 

Follow Us:
Download App:
  • android
  • ios