Asianet News TeluguAsianet News Telugu

ఇంధన డిమాండ్‌ ఢమాల్‌: ఏప్రిల్‌లో 46% డౌన్.. ఎల్పీజీ యూసేజ్ 21% అప్

కరోనాను నియంత్రించడానికి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో గడిచిన ఏప్రిల్‌లో పెట్రోల్‌, డీజిల్‌ వాడకం భారీగా తగ్గిపోయింది

Indias Fuel Consumption Falls 46% To Lowest Since 2007
Author
New Delhi, First Published May 10, 2020, 1:55 PM IST


న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించడానికి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో గడిచిన ఏప్రిల్‌లో పెట్రోల్‌, డీజిల్‌ వాడకం భారీగా తగ్గిపోయింది. క్రితం ఏప్రిల్‌ నెలలో కేవలం 9.93 మిలియన్‌ టన్నుల ఇంధన డిమాండ్‌ మాత్రమే చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. 

గతేడాది ఏప్రిల్‌ వాడకంతో పోల్చితే 45.8 శాతం తక్కువగా నమోదైనట్టు కేంద్ర ముడి చమురు సంస్థలు వెల్లడించాయి. ఇది 2007 నాటి తర్వాత ఇదే అత్యల్ప వినియోగమని పేర్కొన్నాయి. శుద్ధి చేసిన ఇంధనాన్ని దేశీయ ఇంధన రిటైల్‌ సంస్థలు గత సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్‌ తొలి రెండు వారాల్లో 50శాతం తక్కువ మొత్తాన్ని విక్రయించినట్టు పేర్కొన్నాయి.

గత నెల తొలి రెండు వారాల్లో ప్రభుత్వ రంగంలోని రిటైల్‌ కంపెనీల విక్రయాల్లో 50 శాతం తగ్గుదల నమోదైంది. భారత్‌లో మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

also read:కరోనా పాఠాలు.. రూపు మారుతున్న కార్యాలయాలు

అయితే కొన్ని గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వడంతో ప్రస్తుత మాసంలో ఇంధన అమ్మకాలు పెరుగొచ్చని చమురు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఇఎ) నివేదిక ప్రకారం.. మార్చిలో అంచనా వేసిన 2.4శాతం వద్ధితో పోలిస్తే 2020లో వార్షిక ఇంధన వినియోగం 5.6శాతం పడిపోనుందని అంచనా.

లాక్‌డౌన్‌తో దేశంలో పారిశ్రామిక రంగం పూర్తిగా నిలిచిపోవడంతో డీజిల్‌ వినియోగం భారీగా తగ్గిపోయింది. రవాణ రంగం కూడా దాదాపుగా స్తబ్దుగానే ఉండటంతో పెట్రోల్‌, డీజిల్‌ వాడకం పడిపోయింది.

ఏడాదికేడాదితో పోల్చితే క్రితం ఏప్రిల్‌లో దేశంలో రవాణా, నీటిపారుదల అవసరాలకు ఉపయోగించే డీజిల్‌ వినియోగం ఏప్రిల్‌లో 55.6శాతం పడిపోయినట్లు ఐఇఎ గణంకాలు పేర్కొంటున్నాయి. ఇక పెట్రోల్‌ వినియోగం 60.6 శాతం తగ్గింది. కాగా ఎల్‌పీజీ డిమాండ్‌ మాత్రం 12.1 శాతం పెరిగింది. ఏప్రిల్‌ తొలి పక్షంలో ఎల్‌పీజీ గ్యాస్‌ విక్రయాల్లో 21 శాతం పెరుగుదల నమోదయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios