అర్జంటుగా డబ్బు కావాలా? బ్యాంకుకు వెళ్లడం లేదా స్నేహితుల నుంచి రుణం తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? ఐదు నిమిషాల్లో అప్పు మీకు ఇచ్చేస్తాం. ఇది ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ చేసే ప్రచారం...ఈ లోన్ యాప్స్ వలలో చిక్కిన సామాన్యులు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.
లోన్ యాప్స్ కేవలం లోన్స్ మాత్రమే కాదు, మీ ఫోన్ హ్యాక్ చేస్తుంది. అందులోని ఫోటోలను మార్ఫింగ్ చేయడం, ఇతర ఫోన్ నంబర్లకు అసభ్యకరమైన సందేశాలు పంపడం లాంటివి కూడా చేస్తున్నాయి. ఇలా వందలాది ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దిగుతున్నాయి. అయితే బాధితులు అవమానాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మే నెలలో ముంబైలోని మలాద్‌లో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హలో క్యాష్ అనే యాప్ నుంచి డబ్బులు తీసుకున్నారు. రెట్టింపు వడ్డీతో తిరిగి చెల్లించినప్పటికీ, బెదిరింపులు కొనసాగాయి. బాధితుడి ఫోన్ లోని ఫోటోలను మార్ఫింగ్ చేసి, వైరల్ చేయడతో ఆ యువకుడు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై పోలీసుల ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఇలా వందలాది కేసులు దర్యాప్తు బృందానికి వచ్చాయి.
గత నెలలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారం మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వివిధ పేర్లతో అనేక ఆన్‌లైన్ లోన్ యాప్‌లను నడిపింది. అరెస్టయిన వారిలో ఐదుగురు ఆయా కంపెనీల డైరెక్టర్లు ఉన్నారు. వందలాది సిమ్ కార్డులు, మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 90GB డేటా భారతీయ పౌరుల వ్యక్తిగత సమాచారం, మార్ఫింగ్ చిత్రాలతో నిండి ఉంటుంది. నిందితుల వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ.14 కోట్ల రూపాయలను స్తంభింపజేశారు. అరెస్టయిన వారిలో చైనీస్ ట్రాన్స్ లేటర్లుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు.
లియు ఎవరు?
2018లో బిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనీయుల బృందం భారత్ లో ఈ యాప్స్ దందా మొదలు పెట్టింది. దీని వెనుక ఉన్న నాయకుడి పేరు లియు యి. ఈ యాప్‌లు నకిలీ ఇమెయిల్ చిరునామా ద్వారా సృష్టిస్తారు. వీటి సర్వర్లు చైనా, హాంకాంగ్‌లో ఉంటాయి. కాల్ సెంటర్, మార్కెటింగ్ కోసం భారతీయులను నియమిస్తారు. కోవిడ్ సీజన్ వీరి పంట పండించింది. నిరుద్యోగుల, పేదలు రుణాలు తీసుకోవడానికి ఈ యాప్‌లను ఆశ్రయించారు. 2020-21లో ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు భారీ లాభాలను ఆర్జించాయని గణాంకాలు సూచిస్తున్నాయి. సేకరించిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి తమ దేశానికి పంపడమే ఈ చైనీయుల బృందం ప్రధాన పనిగా పెట్టుకున్నారు. ముంబై పోలీసులు, భువనేశ్వర్ పోలీసులు లియు యిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
నేపాల్‌లోని కాల్ సెంటర్
ముంబై పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా నేపాల్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. నేపాల్ పోలీసులు ఖాట్మండులో కాల్ సెంటర్‌ను గుర్తించారు చైనీస్ ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడి సిబ్బంది బాధితులను బెదిరించి మార్ఫింగ్ చిత్రాలను రూపొందిస్తారు. అక్కడ వెయ్యి మందికి పైగా టెలికాలర్లు పనిచేస్తారు. వసూలు చేసిన డబ్బును ఉద్యోగులకు కమీషన్ చెల్లిస్తారు. అయితే వీరిలో 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో హు హిహువా అనే చైనీస్, ఇద్దరు భారతీయులు ఉన్నారు. భారతీయుల నుండి డబ్బు వసూలు చేసే లోన్ యాప్‌ల వెనుక ఉన్న కాల్ సెంటర్ ఇదే.
రంగంలోకి దిగిన ఈడీ
ఇంతకుముందు, ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల వెనుక చైనీయుల హస్తం ఉన్నట్లు ED గుర్తించింది. నేపాల్ పోలీసులు, ముంబై పోలీసులకు దొరికిన సాక్ష్యాలన్నీ ఇందుకు నిదర్శనం.. భారత్‌లోని దర్యాప్తు సంస్థలకు దొరికిన తర్వాత మోసానికి వచ్చిన చైనీయులంతా దేశం విడిచి వెళ్లిపోయారు. 250 యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడిన లియు చైనాలో తలదాచుకున్నాడు. ఈ ముఠాలోని 10 మందిని అరెస్టు చేశారు. ఇది భారీ అంతర్జాతీయ మోసం కాబట్టి, ఇంటర్‌పోల్, వివిధ దేశాల దర్యాప్తు సంస్థల సహాయం అవసరం.
