ముంబై: డాలర్ ముందు రూపాయి మారకం విలువ వెలవెలబోతున్నది. బుధవారం 71.40 వద్ద సానుకూలంగా ప్రారంభమైన ఫారెక్స్ ట్రేడింగ్.. ఆ వెంటనే దెబ్బ తిన్నది. తాజాగా రూపాయి మరో జీవిత కాల కనిష్ట రికార్డు 71.67ను తాకింది. డాలర్‌కు డిమాండ్‌ బాగా పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి అంతకంతకూ వెలవెలబోతోంది. సోమవారం అత్యంత కనిష్ఠానికి పడిపోయిన రూపాయి మంగళవారం మరో 37 పైసలు దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.58 స్థాయికి జారి.. తాజాగా లైఫ్‌ టైం కనిష్ఠానికి పడిపోయింది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ బాగా బలపడుతోంది. అంతర్జాతీయ వాణిజ్య భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు, దిగుమతిదారులు నుంచి డాలర్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది.బుధవారం మరింత కనిష్ట స్థాయికి పడిపోవడానికి కారణం ముడి చమురు ధరలే కారణం. 

అటు చమురు ధరలు భారీగా పెరగడం, అమెరికా కరెన్సీ డాలరుతో మారకంలో వర్ధమాన దేశాల కరెన్సీలు పతన బాట పట్టడం రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయి. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూ.71.21 వద్ద ముగిసిన రూపాయి.. మంగళవారం ఉదయం ట్రేడ్‌ ప్రారంభ సమయానికే మూడు పైసలు కుంగి 71.24 వద్ద ప్రారంభమైంది. అయితే ఆదిలో కొంత కోలకున్నట్టుగా కనిపించిన రూపాయి స్వల్పంగా బలపడి 71.09 స్థాయికి చేరుకుంది. ఆ తరువాత నుంచి మళ్లీ పతన బాట పట్టి రూ.71.58 స్థాయికి చేరుకుంది. అంతకు ముందు పతనంతో పోలిస్తే ఇది 0.52 శాతం తక్కువ కావడం విశేషం. 

అమెరికా- చైనా, అమెరికా- కెనెడా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న పరిణామాలతో తమ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందేమోనన్న భయాల నేపథ్యంలో వర్తమాన దేశాల కరెన్సీలు విలవిలలాడుతున్నాయి. వాణిజ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో అర్జెంటీనా కరెన్సీ పెసో, టర్కీ కరెన్సీ లిరా, దక్షిణాఫ్రికా కరెన్సీ రాండ్‌, బ్రెజిలియన్‌ కరెన్సీ రియల్‌, ఇండోనేషియా కరెన్సీ రుపై, భారత కరెన్సీ రూపాయిలు పతనమవుతూ వస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు కూడా రూపాయి పతనానికి ఆజ్యం పోస్తున్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్లో చముర ధరలు పెరగడంతో స్టాక్స్‌ కొనుగోలుకు ఇంధన సంస్థలు అధిక మొత్తంలో డాలర్లను చెల్లించాల్సి వస్తోంది. డాలరుకు డిమాండ్‌ పెరగడంతో ఆయా సంస్థలు అధిక మొత్తంలో నిధులను కరెన్సీ మారకానికి వినియోగించాల్సి వస్తోంది. ఆనంద్ రాథీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సంస్థ అనలిస్ట్ రుషాబు మారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి చూస్తే డాలర్‌పై రూపాయి మారకం విలువ 72-73 మధ్య తచ్చాడే అవకాశం ఉన్నదని తెలుస్తోంది, క్రూడయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్‌తో మార్కెట్ సెంటిమెంట్ బేరిష్ గా మారిందన్నారు. 

అమెరికా గల్ఫ్ కోస్ట్‌ను హరికేన్ తుఫాన్ ముంచెత్తనున్నదన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడనున్నాయ. దీంతోనే ముడి చమురు ధరలు పెరిగాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికాకు 17 శాతం ముడి చమురు, ఐదు శాతం సహజ వాయువు ప్రతిరోజూ ఉత్పత్తి చేస్తోంది. అమెరికాకు రిఫైనింగ్ హబ్‌గా గల్ఫ్ కోస్ట్ సేవలందిస్తున్నది. మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ సంస్థ బుధవారం రూపాయి మారకం విలువ 71.20 నుంచి 71.80 మధ్య స్థిరపడొచ్చని అంచనా వేసింది.