IRCTCకి పోటీగా రైల్వే ‘సూపర్ యాప్’: అన్ని సేవలు ఇక్కడే
భారతీయ రైల్వే త్వరలో టికెట్ బుకింగ్ నుండి రైలు లైవ్ స్టేటస్ వరకు అన్ని సేవలను అందించే ‘సూపర్ యాప్’ను ప్రారంభించనుంది. ఇది IRCTCకి పోటీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ యాప్ ద్వారా రైల్వే సేవలను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతీయ రైల్వే పురోగతి వేగంగా సాగుతోంది. ఇప్పటికే వందే భారత్, వందే మెట్రో వంటి రైళ్లతో రైల్వే శాఖ పరుగులు పెడుతోంది. త్వరలో బుల్లెట్ రైళ్లు కూడా దేశంలో పరుగులు పెట్టనున్నాయి. రైల్వే విస్తరణ ఇంత వేగంగా జరుగుతున్నందున టికెట్ బుకింగ్ సేవలను కూడా సులభతరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లోనూ రైలు టికెట్ బుకింగ్ సేవలు మరింత సింపుల్ చేయడానికి చర్యలు చేపడుతున్నారు.
IRCTCకి ఇక గట్టిపోటీ ఇచ్చే యాప్
ఇప్పటి వరకు మీరు టికెట్లను బుక్ చేసుకోవడానికి IRCTC యాప్ ఉపయోగించేవారు. మరి PNR స్టేటస్, రైలు లైవ్ స్టేటస్ తెలుసుకొనేందుకు వేరే యాప్‌లు ఉపయోగించాల్సి వచ్చేది కదా? ఇలాంటి అవస్థల నుంచి విముక్తి కల్పించడానికి ఇండియన్ గవర్నమెంట్ ‘సూపర్ యాప్’ తీసుకొస్తోంది. ఇది కచ్చితంగా IRCTCకి పోటీ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ ‘సూపర్ యాప్’ సహాయంతో టికెట్ బుకింగ్ చేసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. ఈ ‘సూపర్ యాప్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తోంది.
వందే భారత్ రైళ్ల సేవలు అద్భుతం
ఇటీవలే భారత ప్రభుత్వం 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించి రైల్వే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఇవి దేశంలోని 280 జిల్లాల మీదుగా రోజూ ప్రయాణించనున్నాయి. టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మరికొన్ని రూట్లలో ఇవి ప్రయాణించనున్నాయి. మేకిన్ ఇండియా పథకంలో భాగంగా ఈ రైళ్లను తయారు చేసి వినియోగిస్తున్నారు. 160 kmph వేగంతో ఈ రైళ్లు దూసుకుపోతాయి. ఇవి 10 మిలియన్ మంది ప్రయాణికులకు సేవలందిస్తాయి. వేగవంతమైన ప్రయాణ సమయాలు, అధునాతన భద్రతా ఫీచర్లు, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారతీయ రైల్వే కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే
ఈ యాప్ గురించి ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైల్వే కు చెందిన అన్ని సేవలు ఈ సూపర్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. అయితే ఈ సూపర్ యాప్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, ఎంత వరకు దీన్ని డవలప్ చేశారు లాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ యాప్ సహాయంతో రైలు ప్రయాణికులు ఎలాంటి సౌకర్యాలు పొందనున్నారని చెప్పారు. ఇకపై రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక యాప్, PNR స్టేటస్ తెలుసుకోవడానికి మరో యాప్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదన్నారు. రైల్వే సూపర్ యాప్ ప్రారంభించిన తర్వాత అన్ని సమస్యలకు ఇక్కడే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.
రైల్వేకు చెందిన అన్ని సేవలు సూపర్ యాప్ లోనే
ప్రస్తుతం IRCTC రైల్ కనెక్ట్ యాప్ ను 100 మిలియన్లకు పైగా జనం డౌన్‌లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. ఇది రైలు సేవలు అందించే యాప్ లలో అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్‌గా నిలిచింది. రైల్ మదద్, UTS, సటార్క్, TMS-నిరీక్షన్, IRCTC ఎయిర్, పోర్ట్‌రీడ్ వంటి యాప్ లు కూడా రైల్వే సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. వీటన్నింటిలోనూ ఉన్న సేవలను కలిపి ‘సూపర్ యాప్’ ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.