Asianet News TeluguAsianet News Telugu

భారత ఫార్మా కంపెనీలపై అమెరికా ‘కుట్ర’కేసు.. డోంట్ కేర్ అన్న రెడ్డీస్ అండ్ అరవిందో

అమెరికాలో భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచారని కేసులు నమోదయ్యాయి. రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌తో సహా 6 కంపెనీలపై అభియోగాలు దాఖలయ్యాయి. అమెరికాలోని దాదాపు 40 రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు చేశారు. ఇది భారీ హెల్త్‌ కుంభకోణం అని అమెరికా వ్యాఖ్యానించింది. ఫలితంగా సోమ, మంగళవారాల్లో స్టాక్ మార్కెట్లలో సంబంధిత ఔషధ సంస్థల షేర్లు పతనమయ్యాయి. అయితే మంగళవారం కాస్త కోలుకున్నాయి. ఈ సంక్షోభం వల్ల నష్టమేమీ లేదని, న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని రెడ్డీస్ ల్యాబోరేటరీస్, అరవిందో ఫార్మా.. బీఎస్ఈకి సమాచారం ఇచ్చాయి.
 

Indian pharma majors deny allegations of price fixing in US
Author
Washington D.C., First Published May 15, 2019, 12:56 PM IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఔషధాల విక్రయాలు జరుపుతున్న భారత ఫార్మా దిగ్గజ సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అనుచితంగా మందుల ధరల పెంపునకు కుట్ర పన్నారని సన్‌ పార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌తో సహా ఏడు భారతీయ కంపెనీలతోపాటు.. మొత్తం 20 ఫార్మా కంపెనీలపై అమెరికాలో కేసులు నమోదు అయ్యాయి.

అందరికీ అవసరమైన మందుల ధరలకు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నాయని అమెరికాలోని 40కి పైగా రాష్ట్రాల్లోను, యాంటీ ట్రస్ట్‌ సంస్థలోనూ ఈ ఔషధ కంపెనీలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 10వ తేదీన తేదీన కేసులు ఫైలయ్యాయి. 

మదుమేహం, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, మూర్ఛ వ్యాధితోపాటు సుమారు వెయ్యి రకాల ఔషధాల ధరలను నిర్ణయించడంలో 20 ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కుట్రపూరితంగా ధరలను పెంచుతున్నాయంటూ అభియోగాలు నమోదు చేశారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో దేశీయంగా అరబిందో, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌, వోక్‌హాడ్‌, జైడస్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ తదితర సంస్థలు ఉన్నాయి. వీటికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్‌ మందుల తయారీ కంపెనీ టెవా ఫార్మాస్యూటికల్స్‌ కూడా ఉండటం గమనార్హం. 

అమెరికన్ల జీవితాలతో ఆటలాడుతూ జనరిక్‌ మందుల తయారీ రంగంలోని కొందరు వందల కోట్ల డాలర్ల కుంభకోణానికి తెర తీశారనడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కనెక్టికట్‌ అటార్నీ జనరల్‌ విలియమ్‌ టోంగ్‌ టోంగ్‌ అన్నారు. 
యూఎస్‌లోని కనెక్టికట్‌ జిల్లా కోర్టులో దాఖలైన లా సూట్‌లో 21 ఫార్మా కంపెనీల పేర్లను అటార్నీ జనరల్‌ విలియమ్‌ టోంగ్‌ టోంగ్‌ ప్రస్తావించారు. 

ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ధరల దందాకు సంబంధించిన ఈమెయిల్స్‌, టెక్స్ట్‌ మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డుల సాక్ష్యాలు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కనెక్టికట్‌ అటార్నీ జనరల్‌ విలియమ్‌ టోంగ్‌ టోంగ్‌ వివరించారు. 2013 జులై, 2015 జనవరి మధ్య పదుల సంఖ్యలో మందుల ధరలను అమాంతంగా పెంచేందుకు కంపెనీలు కుట్రకు పాల్పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ప్రధానంగా 2013, 2014 జూలై మధ్య కాలంలో 1200 జనరిక్‌ మందుల విలువ 448 శాతం పెరిగిందన్నారు. హెల్త్‌ కేర్‌ రంగంలో అమెరికాలో ఇది భారీ కుంభకోణమని కనెక్టికట్‌ అటార్నీ జనరల్‌ విలియమ్‌ టోంగ్‌ టోంగ్‌ ఆరోపించారు. 

అమెరికాలో వైద్య ఖర్చులు, మందుల ధరలు ఎందుకింత ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై జరిగిన పరిశోధనలో ఈ కుంభకోణం బయటపడిందన్నారు. ఈ కంపెనీలు 116 ఔషధాల ధరలను కృత్రిమంగా పెంచి అధిక లాభాలు గడించటానికి ప్రయత్నించినట్లు ప్రధాన ఆరోపణ. 

ఇందులో మనదేశానికి చెందిన సన్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌, లుపిన్‌ లిమిటెడ్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, జైడస్‌ వెల్‌నెస్‌, వోకార్ట్‌ కంపెనీలపైన కూడా ఆరోపణలు చేశారు. 

ముఖ్యంగా అయిదు ఔషధాలు.. సిప్లోఫ్లాగ్జాసిన్‌, గ్లిమిపిరైడ్‌, ఒగ్జాప్రోజిన్‌, పారికాల్సిటాల్‌, టిజానిడైన్ విషయమై యూఎస్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన అనుబంధ కంపెనీలపై ఆరోపణలు వచ్చాయి. అరబిందో ఫార్మా మీద కూడా ఇదే ఆరోపణలు వచ్చాయి. 

అసలు ఈ వివాదం గత  ఏడాది జూన్‌లోనే వెలుగు చూసింది. అప్పుడే క్లాస్‌ యాక్షన్‌ లా సూట్‌ దాఖలైంది మళ్లీ ఈ నెల 10న రెండవ లా సూట్‌ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటినీ కలిపి విచారించే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో స్టానిక కంపెనీలైన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌, అరబిందో ఫార్మా స్పందించాయి. ఈ న్యాయ వివాదాన్ని గట్టిగా ఎదుర్కొంటామని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ మంగళవారం బీఎస్‌ఈకి ఇచ్చిన వివరణలో స్పష్టం చేసింది. దీని వల్ల ఇప్పటికిప్పుడు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆదాయం- లాభాలపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. 

అరబిందో ఫార్మా కూడా ఇదే విషయం చెప్పింది. తమపై వచ్చిన ఆరోపణలపై ఫెడరల్‌ కోర్టులో సమాధానం ఇస్తామని అరబిందో ఫార్మా పేర్కొంది. ఈ ఆరోపణల వల్ల తమ వ్యాపార కార్యకలాపాలకు వచ్చే ఇబ్బందేమీ లేదని వివరించింది.

కృత్రిమంగా మందుల ధరలను పెంచినట్లు ఆరోపిస్తూ యూఎస్‌లోని 49 రాష్ట్రాలు ‘యాంటీ-ట్రస్ట్‌ లా సూట్‌’ దాఖలు చేయటంతో స్టాక్‌మార్కెట్లో ఈ నెల 13న బాగా నష్టపోయిన దేశీయ ఔషధ కంపెనీల షేర్ల ధరలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా షేర్‌ ధరల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios