Asianet News TeluguAsianet News Telugu

ఆయుష్మాన్ భారత్ ఎఫెక్ట్: రూ.20 లక్షల కోట్లకు బీమా

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు, బీమా రక్షణ కలిగి ఉండే విషయమై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దేశీయ బీమా పరిశ్రమకు కలిసి రానున్నది. ఇందువల్ల బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. 

Indian insurance to be $280 billion industry by 2019-20: Assocham
Author
New Delhi, First Published Sep 10, 2018, 7:38 AM IST

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు, బీమా రక్షణ కలిగి ఉండే విషయమై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దేశీయ బీమా పరిశ్రమకు కలిసి రానున్నది. ఇందువల్ల బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది.

వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ బీమా రంగం 280 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అసోచామ్-ఏపీఏఎస్ సర్వేలో తేలింది. మన కరెన్సీలో రూ.20 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, బీమాపై ప్రజల్లో అవగాహణ పెరుగుతుండటం ఇందుకు కారణమని విశ్లేషించింది.

2001లో 2.71% నుంచి 16 ఏళ్లలో 3.7 శాతానికి బీమా
2001లో 2.71 శాతంగా ఉన్న బీమా వినిమయం 2017 నాటికి 3.7 శాతానికి చేరుకున్నది. 2011-12లో రూ.3.2 లక్షల కోట్లు (49 బిలియన్ డాలర్లు)గా ఉన్న స్థూల ప్రీమియం వసూళ్లు గతేడాదికి రూ.5 లక్షల కోట్ల (72 బిలియన్ డాలర్లకు)కు చేరుకున్నాయని తెలిపింది.

బీమా పరిధిని పెంచడానికి కేంద్రం, రెగ్యులేటర్ చేస్తున్న కృషితో పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగడానికి దోహదం చేస్తున్నదని, ముఖ్యంగా మధ్య, యువతీయువకులు పెరుగుతుండటం, వీరికి బీమా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన ఉండటం కూడా ఇందుకు కారణమని సర్వేలో తెలిపింది. 

పేదల ఆరోగ్యానికి ఆయుష్మాన్ భారత్ ఇలా
పదికోట్ల మంది నిరుపేదలకు బీమా కవరేజ్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌ను స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం కింద రూ.5 లక్షల వరకు పాలసీదారుడి కుటుంబానికి ప్రమాద బీమా లభించనున్నది.

దీంతో బీమా రంగం రూపు రేఖలు మారడంతోపాటు లక్షలాది మందికి నూతనంగా ఉద్యోగాలు లభించనున్నాయని సర్వే ఆకాంక్షించింది. సామాన్యుడి ఆదాయం పెరుగుతుండటం, మరోవైపు అంతర్జాతీయ సంస్థలు దేశీయ బీమా రంగంలోకి ప్రవేశించడం, సులభతరంగా నియంత్రణ మండళ్లు అనుమతించడం వంటి పరిణామాలు బీమా వినియోగం పెరుగడానికి ప్రధాన కారణం.

సాధారణ బీమాలో ప్రైవేట్ సంస్థల వాటా 48%
ప్రైవేట్ బీమా రంగ సంస్థల విషయానికి వస్తే జనరల్ ఇన్సూరెన్స్‌లో 48 శాతం వాటా ఉండగా, జీవిత బీమాలో 29 శాతం కలిగి ఉన్నాయి. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని పేర్కొంది. జీవిత బీమా రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, వచ్చే ఐదేండ్లకాలంలో ప్రీమియం వసూళ్లలో భారీ పెరుగుదల నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని అవుట్‌లుక్‌లో పేర్కొంది.

ఆయుష్మాన్ భారత్‌తో హెల్త్‌కేర్, అనుబంధ రంగాలైన ఫార్మాస్యూటికల్స్, డయాగ్నిస్టిక్, మెడికల్ డివైజ్, డాటా మేనేజ్‌మెంట్, బీమా హాస్పిటాల్టీ టీపీఏఎస్, మానవ వనరులు, కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగాలు కూడా మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉన్నదని తెలిపింది. 

రెండేళ్లలో బీమా రంగంలోకి పోస్టాఫీసు
ఇటీవలే బ్యాంక్‌ సేవల్ని (ఐపీపీబీ) ప్రారంభించిన తపాలా విభాగం, మరో రెండేళ్లలో బీమా కంపెనీని ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా వెల్లడించారు. ‘తపాలా విభాగం ఇటీవలే చెల్లింపుల బ్యాంక్‌, పార్సిల్‌ డైరెక్టరేట్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.

రెండేళ్లలో బీమా సంస్థను స్థాపించేందుకు ప్రతిపాదించింది. ఇందు కోసం కన్సల్టెంట్‌ను నియమించమని కోరింది. దీనిపై వచ్చే వారం ఓ నిర్ణయం తీసుకుంటామ’ని సిన్హా వివరించారు. బ్యాంకింగ్‌ సేవలు ప్రస్తుతం 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్‌ పాయింట్ల ద్వారా అందుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios