Asianet News TeluguAsianet News Telugu

చైనా ఉత్పత్తులపై భారీగా మోగనున్న టాక్సుల మోత...

సరిహద్దులు దాటి వచ్చి దూకుడుగా వ్యవహరించిన చైనాకు బుద్ధి చెప్పే దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలో చైనా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధించాలని యోచిస్తున్నది. అందుకు అనుగుణంగా దిగుమతి వస్తువుల జాబితాను సిద్ధం చేస్తున్నది.
 

indian Govt planning to hike customs duty on imported Chinese products
Author
Hyderabad, First Published Jun 20, 2020, 11:09 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: దేశంలోకి దిగుమతవుతున్న చైనా వస్తు ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధించేందుకు భారత్‌ సమాయత్తం అవుతున్నది. ఈ క్రమంలోనే సదరు దిగుమతుల జాబితాను కేంద్ర వాణిజ్య శాఖ సిద్ధం చేస్తున్నది. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది.

ఈ నేపథ్యంలో డ్రాగన్‌పై ఆర్థిక, వాణిజ్యపరమైన ఒత్తిడిని పెంచాలన్న నిర్ణయానికొచ్చింది. 20 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న చైనాపై యావత్‌ దేశం భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ‘బాయ్‌కాట్‌ చైనా’ నినాదం మార్మోగుతుండగా, చైనా కంపెనీల వస్తువులను ఎవరూ కొనరాదని కెయిట్ సహా వర్తక సంఘాలూ ప్రచారం చేస్తున్న సంగతి విదితమే.

ఈ క్రమంలో ముడి ఔషధ పదార్థాలు, పారిశ్రామిక రసాయనాలు, టెలికం పరికరాలు‌, తోలు ఉత్పత్తులు, ఉక్కు వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నీచర్‌, హార్డ్‌వేర్‌, టెక్స్‌టైల్స్‌ తదితర చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న వాటిపై సుంకాలను పెంచాలని వాణిజ్య శాఖకు సూచనలు అందాయి. 

ఈ విషయంలో వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, ఎగుమతి సంఘాలతోనూ ముమ్మర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే 111 చైనా ఉత్పత్తులపై బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ దిగుమతి సుంకాలను పెంచినది తెలిసిందే. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలు కేంద్రం సుంకాల పెంపు యోచనకు కొంత అడ్డంకిగా నిలుస్తున్నాయి. 

కేవలం ఒక్క దేశంపై సుంకాల భారాన్ని మోపడం డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధం. దీంతో చైనా నుంచే ఎక్కువగా దిగుమతి అవుతున్న వస్తువులపైనే భారత్‌ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం భారత్‌-చైనా వాణిజ్య లోటు 57.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది.

భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో దేశంలో చైనా వస్తువుల బహిష్కరణ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు లాభించనున్నదని ఆర్థిక వేత్తలు చెప్తున్నారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత్‌ సుంకాలను పెంచితే దేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుందని అంటున్నారు.

also read ప్రపంచ కుబేరుల్లో మరో కోత్త రికార్డు.. టాప్-10లో ముకేశ్ అంబానీ..

కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ దేశంలోనే తయారైతే బాగుంటుందని అనిపిస్తున్నా అది ఆచరణీయం కాదని ఆర్థికవేత్త యోగేంద్ర కపూర్‌ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి ఎలక్ట్రానిక్‌, ముడి ఔషధ పదార్థాలు 70 శాతం చొప్పున, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ 45 శాతం, తోలు ఉత్పత్తులు 40 శాతం, ఆటో విడిభాగాలు 20 శాతం మేర దిగుమతి అవుతున్నట్లు గుర్తుచేశారు. 

మరోవైపు నిర్మాణ రంగ సంఘం క్రెడాయ్‌ కూడా తమ సభ్యులను చైనా తయారీ వస్తువులను వాడరాదంటూ కోరింది. ఇదిలావుంటే చైనా ఆన్‌లైన్‌ వాణిజ్య ప్రదర్శనకూ ప్రపంచవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడం గమనార్హం.

భారత్‌లో చైనా వస్తువుల బహిష్కరణ ప్రచారోద్యమం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో శుక్రవారం చైనా స్పందించింది. పరిస్థితులను శాంతింపజేసేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నది.

షియోమీ, వివో, ఒప్పో, రియల్‌మీ, హువావే తదితర చైనా సంస్థల ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గల్వాన్‌ దుర్ఘటన కారణంగా ఇప్పుడీ విక్రయాలు ప్రమాదంలో పడ్డాయి.

కాగా, ఈ వివాదంలో భారత్‌దే తప్పన్న రీతిలో చైనా విదేశాంగ శాఖ స్పందిస్తున్నా, వాణిజ్య కోణంలో మాత్రం ఆచితూచి మాట్లాడుతుండటం ఆ దేశ ద్వంద్వనీతికి అద్దం పడుతున్నది. బాయ్‌కాట్‌ నినాదంతో భారత్‌కు చైనా ఎగుమతులు రూ.1.3 లక్షల కోట్ల మేర ప్రభావితం కావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

అఖిల భారత వర్తక సంఘం 3 వేల చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ప్రచారం చేయవద్దని సినీ, క్రీడాకారులకు లేఖలు కూడా రాయగా, ఇటీవల 3 చైనా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ కోరింది. వ్యాపారులు, వినియోగదారుల నుంచి కూడా గొప్ప మద్దతు లభిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios