Asianet News TeluguAsianet News Telugu

ధరలకు ఆన్‌లైన్‌‌తో బ్రేక్.. 18.1 బిలియన్ డాలర్లకు ఈ–ఫార్మసీ మార్కెట్‌


రోజురోజుకు పెరుగుతున్న ధరల భారానికి తెర దించేందుకు ఆన్‌లైన్ అడ్డుకట్ట వేస్తోంది. 2023 నాటికి 18.1 బిలియన్‌ డాలర్లకు ఈ-ఫార్మసీ మార్కెట్ పెరగడానికి ఇంటర్నెట్‌ జోరే ప్రధాన ఊతమిస్తోంది. దీనికి అధిక చికిత్స వ్యయాలూ కారణమే ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) రూపొందించిన నివేదిక పేర్కొంది.

Indian e-pharma market poised to touch US$2.7 billion by 2023
Author
New Delhi, First Published May 30, 2019, 12:49 PM IST

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, గ్రోసరీలు, ఇతర వస్తువుల విషయమై ఈ–కామర్స్‌ లావాదేవీలు పెరుగుతున్నట్టే ఫార్మసీ రంగంలోనూ ఆన్‌లైన్‌ లావాదేవీలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. వచ్చే నాలుగేళ్లలో అంటే 2023 నాటికి దేశీయంగా ఈ–ఫార్మసీల మార్కెట్‌ 18.1 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్‌ యంగ్ (ఈవై) అంచనా వేసింది. 

స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండటం, ప్రాణాంతక వ్యాధులు.. వైద్య చికిత్స వ్యయాలు ఎక్కువవుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం కానున్నాయని ఈవై పేర్కొన్నది. ప్రస్తుతం ఈ–ఫార్మా సంస్థలకు అందుబాటులో ఉన్న మార్కెట్‌ పరిమాణం సుమారు 9.3 బిలియన్‌ డాలర్లు. ఇది వార్షికంగా 18.1% వృద్ధి చెందుతోంది.

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతుండటం.. ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఔషధాలను సులభతరంగా ఆర్డరు చేయగలుగుతుండటం వంటి అంశాలు ఈ–ఫార్మా మార్కెట్‌ వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాణాంతక వ్యాధులు, తలసరి ఆదాయం, వైద్య చికిత్స వ్యయం పెరుగుతుండటంతో ఈ–ఫార్మసీ మార్కెట్‌కు తోడ్పడుతోంది.

‘మొబైల్స్‌ వినియోగం పెరగటం, డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థలు మెరుగుపడటం వంటి అంశాలతో భారత్‌లో ఈ–కామర్స్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ–కామర్స్‌లో భాగమైన ఆన్‌లైన్‌ ఫార్మసీలకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతోంది. వీటికి గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి’ అని ఈవై ఇండియా ఈ–కామర్స్‌ అండ్‌ కన్జూమర్‌ ఇంటర్నెట్‌ విభాగం పార్ట్‌నర్‌ అంకుర్‌ పహ్వా చెప్పారు.  

వైద్యంపై ఇటు ప్రభుత్వం అటు ప్రజలు చేసే వ్యయాలు గణనీయంగా పెరుగుతుండటంతో వచ్చే నాలుగేళ్లలో ఈ–ఫార్మసీ మార్కెట్‌ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుందని ఈవై తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 35% ఫార్మా మార్కెట్‌ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలది కాగా మిగతా 65%.. తీవ్ర అనారోగ్యాలకు సంబంధించిందిగా ఉంటోంది. 

ప్రాణాంతక వ్యాధుల ఔషధాల మార్కెట్‌లో 85% వాటా, తీవ్ర అనారోగ్యాల ఔషధాల మార్కెట్‌లో 40% ఈ– ఫార్మసీ  లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక సూచించింది. స్థానిక ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని నేరుగా ఇంటి దగ్గరకే ఔషధాలను అందించగలగడం ఈ– ఫార్మసీలకు దోహదపడవచ్చని పేర్కొంది. 

ఈ–ఫార్మా కంపెనీలు భారీమొత్తంలో డిస్కౌంట్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. లాభనష్ట రహిత స్థితికి రావాలన్నా, అర్థవంతమైన లాభాలు చూడాలన్నా డిస్కౌంట్లు సముచిత స్థాయిలకు రావాల్సిన అవసరం ఉందని నివేదిక వివరించింది.

భవిష్యత్‌లో ఈ–ఫార్మా వ్యాపార విభాగంలో అంతర్జాతీయ ఈ–కామర్స్‌ సంస్థలు మరింత దూకుడుగా కార్యకలాపాలు విస్తరించవచ్చని ఈవై నివేదిక వివరించింది. అంతర్జాతీయ అనుభవం, దేశీయంగా వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉండటం వాటికి తోడ్పడగలదని పేర్కొన్నది. 

ఫిన్‌టెక్, హెల్త్‌టెక్‌ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి తమ సేవల పరిధిని మరింతగా విస్తరించడానికి వీలుందని ‘ఈవై’ సంస్థ వివరించింది. డెలివరీ వ్యవస్థను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు హైపర్‌లోకల్‌ సంస్థలు (ఫుడ్‌ టెక్, నిత్యావసరాల విక్రయ సంస్థలు, కేవలం డెలివరీ మాత్రమే చేసే సంస్థలు) కూడా ఈ–ఫార్మా విభాగంపై దృష్టి పెట్టొచ్చని పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios