న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ నష్టాలను తగ్గించుకునే పనిలో పడింది. తక్కువ లాభాలు వచ్చే రూట్లలో విమాన సర్వీసులను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఆకర్షణీయ మార్కెట్ల వైపు ద్రుష్టి  సారించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తద్వారా వ్యయం తగ్గించి, ఆదాయం పెంచుకుని సిబ్బంది వేతనాల చెల్లింపు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటోంది జెట్ ఎయిర్‌వేస్. 

అధిక ఇంధన వ్యయాలు, రూపాయి విలువలో క్షీణతలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ వరుసగా మూడో త్రైమాసికంలో నష్టాల పాలైంది. సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికానికి కంపెనీ రూ.1,261 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ.71 కోట్ల లాభాన్ని ఆర్జించింది. స్టాండ్‌ ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నష్టం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,297.46 కోట్లు ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ.49.63 కోట్ల లాభం నమోదైంది.

జెట్ ఎయిర్ వేస్ సంస్థ తన సమగ్ర సమీక్ష తర్వాత ఆపరేషన్ల హేతుబద్దీకరణకు చర్యలు చేపట్టింది. మరింత ఆదాయం జాతీయ, అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ప్రారంభిస్తామని జెట్ ఎయిర్ వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థికంగా లాభదాయక రూట్లలో మరింత సమర్థవంతంగా సేవలందిస్తామిన జెట్ఎయిర్ వేస్ భాగస్వామి ఎతిహాద్ ప్రకటించింది. విమానయాన రంగంలో ఏటా అంతర్జాతీయంగా 20 శాతం ప్రయాణికుల వ్రుద్ధి నమోదవుతోంది. 

అయితే జెట్ ఎయిర్ వేస్ సమీక్షా త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు 6.9 శాతం  వృద్ధితో రూ.5,952 కోట్ల నుంచి రూ.6,363 కోట్లకు పెరిగాయి. నరేష్‌ గోయల్‌ ప్రమోట్‌ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
 
ఉద్యోగుల వేతనాలతోపాటు ఇతర చెల్లింపులు కూడా సకాలంలో చేయలేని పరిస్థితి నెలకొంది. ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో కంపెనీ ఇంధన వ్యయాలు 58.6 శాతం పెరిగి రూ.2,419.76 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇంధనం కోసం కంపెనీ చేసిన ఖర్చు రూ.1,525.66 కోట్లు. కంపెనీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వచ్చే రెండేళ్ల కాలంలో రూ.2,000 కోట్లు ఆదా చేసేందుకు వివిధ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. లాభదాయకతపై దృష్టిసారించామని, సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌ దూబే తెలిపారు.

ఇదిలా ఉండగా విమానయాన రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజార్టీ వాటాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేయనున్నట్లు ప్రచారం జోరందుకుంది. 
టాటాగ్రూప్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌లో 51శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌కు చెందిన వాటాలను, ఎతిహాద్‌ వాటాలను టాటాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది. ఈ కొనుగోలుకు సంబంధించి రెండో దశ చర్చలు జరగుతున్నట్లు సమాచారం. దీనిపై జెట్‌ ఎయిర్‌ వేస్‌ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదని తెలిపారు. ఇప్పటికే జెట్‌ఎయిర్‌ వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ రతన్‌ టాటా, ముఖేష్‌ అంబానీలతో భేటీ అయినట్లు సమాచారం.