Asianet News TeluguAsianet News Telugu

ఎస్ ఇది నిజం: 29 అమెరికా ఉత్పత్తులపై భారీగా భారత్ సుంకాలు.. 16 నుంచి అమలు

ఆలింగనాలు చేసుకున్నా.. దాసోహం అన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు లేదు. అమెరికాకు వాణిజ్య పరంగా లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తొలుత చైనా, తదుపరి యూరప్ దేశాలు.. ఆపై మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. గతేడాదే భారత్ నుంచి స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలు విధించింది. ఈ నెల ఐదో తేదీ నుంచి భారత్ కు ఇచ్చిన జీఎస్పీ హోదాను ఉపసంహరించుకున్నది. అన్ని విధాల వేచి చూసిన మోదీ సర్కార్.. 29 అమెరికా ఉత్పత్తులపై భారీగా ప్రతీకార సుంకాలు విధించడానికి సిద్దమైంది. అంతా అనుకున్నట్లు సాగితే ఈ నెల 16 నుంచి ఆ సుంకాలు అమల్లోకి వస్తాయి.

India readies retaliatory duties on 29 US goods
Author
New Delhi, First Published Jun 15, 2019, 10:51 AM IST

న్యూఢిల్లీ: పన్ను విధింపుపై భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే ప్రీమియం లగ్జరీ వాహనాలపై 50 శాతం విధిస్తున్న భారత ప్రభుత్వం.. మరో 29 అమెరికా ఉత్పత్తులపై అదనపు కస్టమ్స్ సుంకం విధిస్తామని శుక్రవారం ప్రకటించింది. 

ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో ఏడాది కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పన్నుల విధింపు ఈ నెల 16 నుంచి అమలులోకి రానున్నట్లు తాజాగా వెల్లడించింది. వీటిలో బాదం పప్పు, వాల్నట్, పప్పు దినుసులతోపాటు ఇతర ఉత్పత్తులు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఈ విషయమై త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయబోతున్నది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికా నుంచి దిగుమతి అవనున్న ఈ 29 ఉత్పత్తుల ధరలు మరింత పెరుగనున్నాయి. దీంతో కేంద్రానికి 217 మిలియన్ డాలర్ల అధిక ఆదాయం సమకూరనున్నది. 

భారత్‌ నుంచి స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ పన్నులు విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా 29 వస్తువులపై పన్ను విధించాలని నరేంద్ర మోదీ సర్కార్ గతేడాది జూన్ 21వ తేదీనే భావించినా పలుమార్లు వాయిదా పడింది. 

అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 29 రకాల ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచుతున్న విషయమై ఆ దేశ ప్రభుత్వాధికారులకు ఇది వరకే సమాచారం అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది మార్చిలో దేశీయ స్టీల్‌పై 25 శాతం, అల్యుమినియం 10 శాతం చొప్పున దిగుమతి సుంకాన్ని విధించిన ట్రంప్ సర్కార్‌కు ప్రతీకారంగా అప్పట్లోనే పన్నును విధించాలని భావించినా వెనక్కి తగ్గింది. అంతకుముందు వీటిపై ఎలాంటి పన్ను విధించలేదు.

ఈ రెండు రకాల ఉత్పత్తులను అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. దీంతో దేశీయ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తిదారులు 240 మిలియన్ డాలర్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. విధించిన పన్నులను అమెరికా సర్కార్ ఉపసంహరించుకుంటుందని భావించిన భారత ప్రభుత్వం ప్రతీకార సుంకాల విధింపును పలుమార్లు వాయిదా వేసింది. 

కానీ అమెరికా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 29 ఉత్పత్తులపై పన్నును విధించింది. ఈ నేపథ్యంలో జీఎస్‌పీ పథకంలో భాగంగా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న వాటిపై ఇచ్చే ప్రయోజనాలను ఈ నెల 5 నుంచి అమెరికా సర్కార్ విరమించుకున్నది. జీఎస్పీ ఉపసంహరణతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న 5.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై ప్రభావం చూపనున్నది. 

కేంద్ర సర్కార్ 29 అమెరికా ఉత్పత్తులను పన్ను విధించింది. వీటిలో వాల్‌నట్‌పై 120 శాతం దిగుమతి సుంకం విధించింది. అంతకుముందు ఇది 30 శాతంగా ఉన్నది. శనగలు, ఎర్రపప్పుపై సుంకాన్ని 30 శాతం నుంచి 70 శాతానికి పెంచింది. కాయధాన్యాలపై విధించే పన్నును 40 శాతానికి పెంచబోతున్నది. 

వీటితోపాటు బోరిక్ యాసిడ్, బైండర్లపై పన్నును 7.5 శాతానికి పెంచిన కేంద్రం..ఒక రకమైన రొయ్యలపై పన్నును 15 శాతానికి సవరించింది. అలాగే గింజలు, ఇనుము, స్టీల్ ఉత్పత్తులు, యాపిల్, బేర్స్, స్టెయిన్‌లెస్ స్టీల్, ట్యూబ్, పైప్ ఫిట్టింగ్, మరలు, బోల్టులపై కూడా పన్నును విధించింది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ వివాదం పరిష్కరించుకోవాలని భారత్ చూసినా నిరాశే ఎదురైంది.

భారత్ నుంచి అమెరికా ప్రతియేటా 1.5 బిలియన్ డాలర్ల విలువైన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. 2017-18లో భారత్ నుంచి 47.9 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవగా, ఇదే సమయంలో 26.7 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios