న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. మరోసారి మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా తయారైందని, వృద్ధికి, మాంద్యానికి మధ్య చిక్కుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ దారుణంగా పడిపోయిందన్నారు. 

ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) అధికార కేంద్రంగా మారిందని రఘురామ్ రాజన్ మండిపడ్డారు.  మంత్రుల చేతిలో అధికారం లేదని, అంతా డమ్మీలుగా మారారని విమర్శించారు. ఇండియా టుడే మ్యాగజైన్‌కు రాసిన వ్యాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలను రాజన్ సిఫారసు చేశారు.

also read చేతక్ టూ పల్సర్‌.. దటీజ్ రాహుల్ బజాజ్‌

పెట్టుబడులు, భూమి, కార్మిక మార్కెట్లను సరళతరం చేసేందుకు సంస్కరణలు ప్రవేశపెట్టాలని రఘురామ్ రాజన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని, దీనివల్ల పోటీ వాతావరణం పెరిగి, దేశంలో ప్రభావవంతమైన మార్కెట్లు ఏర్పడుతాయన్నారు. 

ప్రధాని కార్యాలయంలోనే నిర్ణయాలు, ఆలోచనలు, ప్రణాళికలు జరుగుతున్నాయని, ఈ విధానం ఎంతమాత్రం మంచిది కాదని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక అజెండాలకు పీఎంవో తీరు సరిపోతుందేమోగాని, ఆర్థిక సంస్కరణలకు ఈ విధానం పనికిరాదన్నారు. ఏ చిన్న నిర్ణయమైనా, ఆలోచనలు- ప్రణాళికలైనా ప్రధాని చుట్టూ ఉన్న కొంత మంది వ్యక్తులు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే వెలువడుతున్నాయన్నారు. 

అవి రాజకీయంగా, సామాజికంగా పార్టీకి ఉపయోగ పడొచ్చు గానీ, ఆర్థిక వ్యవస్థకు పనికి రావన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా పొరబాట్లు జరిగి ఉండొచ్చన్న ఆయన అవి ఆర్థిక సరళీకరణకు పెద్దపీట వేశాయని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం దానిపై దృష్టి పెట్టడం లేదని రఘురామ్ రాజన్ విమర్శించారు. మంత్రులకు దిశా-నిర్దేశం చేసేవారే లేరని తేల్చి చెప్పారు. 

మోదీ ప్రభుత్వం సామాన్య ప్రభుత్వం-సుపరిపాలన నినాదంతో అధికారంలోకి వచ్చిందని రఘురామ్ రాజన్ గుర్తుచేశారు. కానీ అలా ఏమీ జరుగడం లేదన్నారు. నగదు బదిలీ వంటి కొన్ని విజయాలు సాధించినా.. ఎన్నో నిర్ణయాలు ప్రతికూల ఫలితాల్ని అందించాయని రఘురామ్ రాజన్ అన్నారు. 

ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేయడమే ఇప్పుడు మోదీ సర్కార్ ముందున్న అతిపెద్ద సవాల్ అని చెప్పారు. భూ సేకరణ, కార్మిక చట్టాలు, స్థిరమైన పన్నులు, ప్రభావవంతమైన నియంత్రణ వ్యవస్థ, వేగవంతమైన దివాలా పరిష్కారాలు, విద్యుత్ సంస్కరణలు అవసరమని రాజన్ అభిప్రాయపడ్డారు. 

దేశీయ నిర్మాణ, స్థిరాస్తి, మౌలిక రంగాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న ఆయన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు తమ రుణాలపట్ల అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు. నిరుద్యోగం పెరిగిపోతున్నదని, దేశీయ వ్యాపారాల్లో పెట్టుబడులు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

also read  బీ అలర్ట్: అక్కడ S అనే అక్షరం ఉందో లేదో చూసుకోండి.. లేదంటే..

మంత్రులు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులను ఏర్పరచాలని రఘురామ్ రాజన్ తెలిపారు. రాష్ర్టాలతో కేంద్రానికి సత్సంబంధాలుండటం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు.దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే కనీసం 8-9 శాతం వృద్ధిరేటు ఉంటేనే అది సాధ్యమని రఘురామ్ రాజన్ అన్నారు. 

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 8-9 శాతం స్థాయి జీడీపీ అంత సులువు కాదని రఘురామ్ రాజన్ అన్నారు. దీంతో 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ లక్ష్యం నెరవేరడం కష్టమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే.

అంతకుముందు త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 5 శాతంగా ఉన్నది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)సహా దేశ, విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్న సంగతి విదితమే. ఆర్బీఐ సైతం ఈసారి జీడీపీ అంచనాను ఐదు శాతానికి కుదించడం.. దేశ ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతున్నది. అంతకుముందు 6.1 శాతంగా అంచనా వేసింది. దీంతో అప్రమత్తంగా ఉండకపోతే అనర్థాలు తప్పవని రాజన్ హెచ్చరించారు.