న్యూఢిల్లీ: మోసపూరిత ఆర్థిక లావాదేవీలు పెరిగిపోతుండటంతో బ్యాంకులు తమ కస్టమర్లను ఎప్పకప్పుడు హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఖాతాదారులు జాగ్రత్తగా ఎంత ఉంటున్నా మోసగాళ్లు వినూత్న పద్ధతులననుసరిస్తూ బ్యాంకు ఖాతాలు, ఈ-వ్యాలెట్ల నుంచి నగదును వాడుకోవడంగానీ, తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవడం గానీ చేస్తున్నారు. దీని వల్ల ఖాతాదారులకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. మోసగాళ్లు ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో తెలుసుకుంటే వాటి బారిన పడకుండా ఉండవచ్చు. ఆయా మోసాల గురించి తెలుసుకుందాం..

వాహన్ డాటాబేస్ కి మొబైల్ నంబర్లను తప్పనిసరిగా లింక్ చేయాలి...
 
బ్యాంకులు అత్యాధునిక టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తూ ఖాతాల నిర్వహణను, నగదు బదిలీని, చెల్లింపులను మరింత సులభతరం చేస్తున్నాయి. ఈ తరుణంలో బ్యాంకు ఖాతాల భద్రత, రక్షణ కూడా ఎంతో ముఖ్యమైంది. బ్యాంకులు తమ లక్షలాది మంది కస్టమర్ల ఖాతాలకు తగిన భద్రతను కల్పిస్తాయి.

ఇదే సమయంలో ఖాతాదారులు కూడా తమ ఖాతాల ద్వారా నిర్వహించే లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మోసగాళ్లు, ఆన్‌లైన్‌ హ్యాకర్లు బ్యాంకుల సెక్యూరిటీ వ్యవస్థలో ఎక్కడ లోపాలు ఉన్నా వాటి ద్వారా మోసానికి పాల్పడాలని చూస్తుంటారు. ఖాతాదారుల వివరాలను సంపాదించి కూడా సొమ్మును కాజేస్తారు.

కొంత మంది తెలిసీతెలియక తమ ఖాతా వివరాలు, పాస్‌ వర్డుల విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుంటారు. ఇవే మోసగాళ్లకు వర ప్రదాయిని అవుతున్నాయి. మోసగాళ్లు ఐడెంటిటీ థెఫ్ట్‌, ఫిషింగ్‌, క్లోనింగ్‌, విషింగ్‌, స్మిషింగ్‌ తదితర విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారు.
 
బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ బ్యాంకు ఖాతా వివరాలు తెలుపాలని కోరే ఫోన్లకు స్పందించవద్దు. బ్యాంకులు ఎప్పుడూ తమ కస్టమర్లకు ఫోన్‌ చేసి ఖాతా లేదా కార్డుల వివరాలను కోరవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బ్యాంకు అధికారులమని మోసకారులే ఫోన్లు చేస్తుంటారు. ఖాతా వివరాలు వెల్లడించకపోతే ఖాతా బ్లాక్‌ అవుతుందని బెదిరిస్తారు. కస్టమర్‌ ఐడీ, నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌, ఏటీఎం పిన్‌, ఓటీపీ, కార్డ్‌ ఎక్స్‌పైరీ డేట్‌, సీసీవీ నెంబరు వంటి వాటిని ఫోన్‌ కాల్స్‌ ద్వారా సేకరించి మోసాలకు పాల్పడుతుంటారు.

వడ్డీరేట్లు పై ఆర్‌బీఐ గుడ్ న్యూస్
 
క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు గల వారు ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి గానీ, వ్యాపారుల వద్ద ఉండే పీఓఎస్‌ మెషిన్ల వద్ద చెల్లింపుల కోసం వినియోగిస్తుంటారు. మోసగాళ్లు ప్రత్యేక డివైజ్‌ల ద్వారా ఈ కార్డుల సమాచారాన్ని దొంగిలిస్తారు. స్కిమ్మర్‌గా పేర్కొనే డివైజ్‌ను ఏటీఎం లేదా పీఓఎస్‌కు అమర్చడంతో అది కార్డు సమాచారాన్ని సేకరిస్తుంది. 
ప్రత్యేక టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా కార్డు వివరాలను మరో కార్డులోకి బదిలీ చేసి లావాదేవీలు నిర్వహిస్తారు. దీని వల్ల సంబంధిత ఖాతాదారులు నష్టపోతారు. అందుకే ఏటీఎం లేదా పీఓఎస్‌ యంత్రం వద్ద ఏవైనా ఇతర పరికరాలు ఉన్నాయో చూసుకోవాలి.
 
మోసాల్లో ఫిషింగ్‌ ఇదోరకం. దీంతో ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారం అంటే కస్టమర్‌ ఐడీ, ఇంటర్నెట్‌ పిన్‌, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు నెంబర్‌, కార్డ్‌ ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ నెంబర్‌ వంటి ముఖ్య వివరాలను తెలుసుకుంటారు. వీటి కోసం ఈ-మెయిల్స్‌,   మెసేజ్‌లను వినియోగిస్తుంటారు. 

మోసగాళ్లు పంపే ఈ-మెయిల్‌ లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలను అందులో గానీ ఎంటర్‌ చేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టవుతుంది. బ్యాంకు లేదా క్రెడిట్‌ కార్డులకు సంబంధించి వెబ్‌సైట్లను ఓపెన్‌ చేసే సమయంలో కచ్చితంగా యూఆర్‌ఎల్‌ను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. బ్యాంకుల అధికారిక, మోసగాళ్ల అనధికారిక వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌లో చిన్న తేడా ఉంటుంది. దాన్ని గుర్తించకుంటే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.  
 
ఎస్‌ఎంఎస్‌ ద్వారా మోసగాళ్లు స్మిషింగ్‌కు పాల్పడుతుంటారు. మొబైల్‌ ఫోన్‌కు ఒక ఎస్‌ఎంఎస్‌ పంపి దాన్ని క్లిక్‌ చేయమని అడుగుతుంటారు. ఒకవేళ దాన్ని క్లిక్‌ చేస్తే మోసపూరిత కంటెంట్‌ మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది. దాని ద్వారా మోసగాళ్లు ఫోన్‌లోని విలువైన డేటా మొత్తం తస్కరించే ప్రమాదం ఉంటుంది.

సాధారణంగా మీరు బహుమతి గెలుచుకున్నారంటూ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. దీన్ని పొందడానికి మెసేజ్‌లో పేర్కొన్న వెబ్‌సైట్‌లో సమాచారం తెలియజేయమని కోరుతారు. ఒకవేళ అందులో సమాచారం తెలియజేస్తే దాని ఆధారంగా మీ ఖాతాలోని సొమ్ము ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి URL(https://)లో S అనే అక్షరం ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి.

అంతేకాక యూఆర్‌ఎల్‌ ముందు పాడ్‌లాక్‌ ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. పాడ్‌లాక్‌ ఉంటే వెబ్‌సైట్‌కు సెక్యూరిటీ సర్టిఫికెట్‌ ఉన్నట్టు లెక్క. మీ సిస్టమ్‌లో యాంటీ వైరస్‌, యాంటీ స్పైవేర్‌ ఉంచుకోవాలి. మీకు తెలియని మెయిల్స్‌ నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఓపెన్‌ చేయవద్దు.

ఈ-మెయిల్‌ ద్వారా గానీ ఫోన్‌ ద్వారా గానీ మీ ఖాతాకు సంబంధించిన వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదు. ఆదాయం పన్ను శాఖ లేదా ఆర్‌బీఐ లేదా బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెబుతూ మీ ఖాతా లేదా కార్డుల వివరాలు అడిగితే చెప్పవద్దు. 

ఇలాంటి సంస్థల నుంచి అధికారులు ఫోన్‌ చేసి ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితిలోనూ అడగరు. సైబర్‌ కేఫ్‌లు లేదా ఉచిత పబ్లిక్‌ వైఫై వసతి వినియోగించుకుంటున్నా నెట్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను వినియోగించుకోకపోవడమే మంచిది.