Crude Oil From Russia: రష్యా నుంచి చవక చమురు కొనేందుకు భారత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో రష్యన్ ఎగుమతులు నిలిచిపోతున్నాయి. అయితే భారత్ తన చిరకాల మిత్రుడు కావడంతో రష్యా చవకగా చమురు అమ్మేందుకు సిద్ధం అవుతోంది.

India Buy Crude Oil From Russia: భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు భారత్‌ 176 మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యలో రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించారు. దీంతో రష్యా క్రూడ్ ఉత్పత్తిపై నిషేధంతో ఒక్కసారిగా చమురు ధరలు వేడెక్కాయి. అటు ప్రపంచ దేశాలు అమెరికా, యూరప్ ఆంక్షలకు జడిసి రష్యా చమురును దిగుమతి చేసుకోవడం లేదు. 

అయితే భారత్ కు మాత్రం రష్యా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చవక ధరకే క్రూడాయిల్ భారత్ కు విక్రయిస్తామని రష్యా ఆఫర్ ఇచ్చింది. దౌత్య పరంగా రష్యా భారతదేశానికి చాలా పాత స్నేహం ఉంది. 3.5 మిలియన్ బ్యారెళ్ల డీల్ త్వరలో రెండు దేశాల మధ్య జరగనుంది. ఈ చమురును భారత్‌కు రవాణా చేసేందుకు అయ్యే ఖర్చును, బీమాను రష్యా స్వయంగా భరించనుంది. ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరులో భారత్ తన వైఖరిని తటస్థ వైఖరి ప్రదర్శించింది. చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని పట్టుబట్టింది. ఐక్యరాజ్యసమితిలో ఈ అంశంపై జరిగిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. మరోవైపు రష్యా నుంచి అతి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే.. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్లు అవుతుందని అమెరికా పేర్కొంది.

కాగా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసే ప్రతిపాదనను భారత్ పరిశీలిస్తోందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం రాజ్యసభలో తెలిపారు. రాయితీపై చమురు కొనుగోలు చేయడం వల్ల భారతదేశానికి చమురు ధర తగ్గుతుందని ఆయన చెప్పారు. ఒప్పందం తర్వాత రష్యా త్వరలో భారత్‌కు చమురును సరఫరా చేయగలదని ప్రముఖ వార్తా సంస్థలు తెలిపాయి. 

ఈ డీల్‌కు సంబంధించిన చెల్లింపు విధానాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ డీల్‌ను రూపీ, రూబుల్‌ ద్వారా జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు భారత్‌ 176 మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి భారత్ 3.6 మిలియన్ టన్నులు కొనుగోలు చేస్తే, ఏప్రిల్ నుంచి జనవరి వరకు జరిగిన మొత్తం డీల్‌లో ఇది 2 శాతంగా ఉంటుంది.

అయితే, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న వార్తలపై భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు డాక్టర్ అమీ బెరా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు భారత దౌత్య వర్గాలు మాత్రం అమెరికా ప్రభుత్వ అధికారులు భారత్ వైఖరిని అర్థం చేసుకోవాలని సూచించారు. భారతదేశం తన భద్రత కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడి ఉందని అమెరికా చట్టసభ సభ్యులతో అన్నారు. 

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లకు పెరిగాయి. అయితే, అది మెత్తబడే సంకేతాలను చూపించింది. ప్రస్తుతం క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరుకుంది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగుస్తుందనే ఆశలపై క్రూడ్ పడిపోయింది.