అనుమానాస్పద ఆదాయం పన్ను (ఐటీ) రిటర్న్‌ల మదింపు(అసెస్‌మెంట్‌) విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పన్ను చెల్లింపుదారులు ఇక తమ రిటర్న్‌ల మదింపు కోసం ఐటీ శాఖ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అధికారుల వేధింపులకు లోను కావలసిన అవసరం లేదు. వారి చేతులు తడపాల్సిన అవసరమూ ఉండదు. 

వ్యక్తిగతంగా ఐటీ అధికారులను సంప్రదించాల్సిన అవసరమూ ఉండదు. ప్రభుత్వం ఇందుకోసం ‘ఈ-అసెస్మెంట్‌’ పేరుతో ప్రత్యేక విధానం తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 
ఈ-అసెస్మెంట్‌ కోసం జాతీయ స్థాయిలో ఒక ఈ-అసెస్మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తారు. పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నా రిటర్న్‌లు ఫైల్‌ చేయనివారికి, ఫైల్‌ చేసినా పూర్తి లావాదేవీల వివరాలు లేని వ్యక్తులకు ఈ కేంద్రం నోటీసులు జారీ చేస్తుంది. 

ఈ నోటీసులు అందుకున్న పన్ను చెల్లింపుదారులు 15 రోజుల్లో ఎలక్ట్రానిక్ పద్దతిలో రిటర్న్‌లు, పూర్తి వివరాలు సబ్‌మిట్‌ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఈ కేంద్రం, ఆ రిటర్న్‌ మదింపు బాధ్యతను, ఆటోమేటిక్‌ పద్దతిలో అసెసింగ్‌ అధికారులకు అప్పగిస్తుంది. ఇక్కడ ఎక్కడా మానవ ప్రమేయం ఉండదు. దీంతో పన్ను చెల్లింపుదారుడు ఎవరనే విషయం అసెసింగ్‌ అధికారులకూ తెలియదు.
 
రిటర్న్‌ మదింపు ప్రక్రియ జరిగే క్రమంలో పన్ను చెల్లింపుదారు స్వయంగా లేదా తన అధీకృత ప్రతినిధి ద్వారా ఎక్కడా ఐటీ ఆఫీసుల గడప తొక్కాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరై చెప్పాలనుకున్నా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే చేయాలి. ఈ-అసెస్మెంట్‌ విధానంతో పాటు పాత విధానమూ అమలులో ఉంటుంది. 

దేన్ని ఎంచుకోవాలనేది పన్ను చెల్లింపుదారుల ఇష్టం. ఈ-అస్సెస్మెంట్ విధానంలో జరిగిన రిటర్న్‌ల మదింపుపై అసంతృప్తి ఉండి అప్పీలుకు వెళ్లాలంటే మాత్రం వ్యక్తిగత హాజరు విధానంలోనే వెళ్లాలి.
 
విచక్షణాధికారం పేరుతో రిటర్న్‌ల మదింపులో అధికారులు వేధిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానం తెచ్చింది. ఈ పథకాన్ని దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే పరీక్షించారు. ఆ ఫలితాల ఆధారంగా ఇపుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దసరాకల్లా దేశ వ్యాప్తంగా ఈ-అసె్‌సమెంట్‌ విధానం తీసుకొస్తామన్న హామీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంతకంటే ముందే నిలబెట్టుకున్నారు.