ప్రగతిలో వెనుకడుగే.. తప్పిన వృద్ధి రేటు అంచనాలు: ఐఎంఎఫ్

IMF lowers India's growth projection, but it still retains world's top spot
Highlights

ఎన్నికల వేళ భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించివేసింది ఐఎంఎఫ్. గత ఏప్రిల్ నెలలో అంచనాలను తగ్గించి మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతం జీడీపీ నమోదవుతుందని పేర్కొన్నది.

న్యూఢిల్లీ: ఆర్థిక రంగంలో చేపట్టిన సంస్కరణలు అందరికి సత్ఫలితాలు ఇస్తున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో సాగిపోతున్నదని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ చేస్తున్న ప్రచారం అంతా డొల్లేనని తాజా ఐఎంఎఫ్ అంచనాలతో తేలిపోయింది. నల్లధనం వెలికితీత, అవినీతి అంతం పేరిట 2016 నవంబర్ 8న అర్థంతరంగా పెద్ధ నోట్ల రద్దు తర్వాత ఎనిమిది నెలలకే దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ‘జీఎస్టీ’ తేవాలన్న సంకల్పం మొదటికే మోసం తీసుకొచ్చేలా కనిపిస్తోంది.

నోట్ల రద్దు పుణ్యమా? అని ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు నిల్వలే ఉండటం లేదు. ఇక జీఎస్టీ అమలు వల్ల లాభ నష్టాలేమిటన్న సంగతి ఏడాది తర్వాత కూడా బయటపెట్టడానికి కేంద్రం ముందుకు రావడం లేదు. కానీ గోటిచుట్టూ రోకటిపోటు అన్న చందంగా భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చేతులు ఎత్తేసింది. మూడు నెలల్లోపే అంచనాలను తగ్గించేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతంగా ఉండొచ్చని, 2019 - 20లో 7.5 శాతానికి పెరుగవచ్చని సోమవారం పేర్కొన్నది. 2017 - 18లో వృద్ధిరేటు 6.7 శాతంగానే ఉన్న విషయం తెలిసిందే. 2017లో తమ అంచనా కంటే భారత జీడీపీ వ్రుద్ధిరేటు 6.7 శాతానికి పెరిగిందని, కానీ జీఎస్టీ ప్రభావంతో మారకం విలువ పడిపోయిందని గుర్తుచేసింది. అయితే మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు త్రైమాసికాల నాటి అత్యధిక 7.7 శాతం వ్రుద్ధి సాధించడం గమనార్హం. 

అయితే వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ (డబ్ల్యూఈవో) ఏప్రిల్ అంచనాలతో పోల్చితే అప్‌డేట్ చేసిన తాజా డబ్ల్యూఈవోలో వృద్ధి అంచనాలు ఈ ఏడాదికి 0.1 శాతం, వచ్చే ఏడాదికి 0.3 శాతం చొప్పున తగ్గుదల కనిపిస్తున్నది. 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతం చొప్పున భారత జీడీపీ నమోదు కావచ్చని గత ఏప్రిల్‌లో ఐఎంఎఫ్ అంచనా వేసింది.

వ్రుద్ధిరేటు మందగమనానికి ద్రవ్యోల్బణం రిస్కులే కారణమని చెబుతున్నా నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆర్బీఐ గత జూన్ నెలలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో రెపోరేటును 6 శాతం నుంచి 6.25 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దేశ, విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అధికంగా నమోదవుతున్న ద్రవ్యోల్బణం, తద్వారా ఆర్బీఐ కఠినంగా అమలు చేస్తున్న ద్రవ్యవిధానాలతో జీడీపీ మందగించవచ్చునని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. 

అందువల్లే క్రిందటిసారితో చూస్తే భారత దేశ ఆర్థిక వృద్ధి అంచనాలు తగ్గాయి. అయినా పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రభావాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడుతున్నదని, జీడీపీ వేగాన్ని సంతరించుకోగలదని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. 

భారత దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించిన ఐఎంఎఫ్.. బ్రెజిల్, అమెరికా, రష్యా, చైనా అంచనాలను యధాతథంగా కొనసాగించింది. భారత్ ఇప్పటికి శరవేగంగా అభివ్రుద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఐఎంఎఫ్ పేర్కొన్నది. పొరుగు దేశం చైనా జీడీపీ కూడా ప్రస్తుత ఏడాది 6.6 శాతంగా నమోదై వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఆర్థిక రంగంలో నియంత్రణ చర్యలు కఠినతరం చేస్తారని, అంతర్జాతీయంగా డిమాండ్ సానుకూలంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొన్నది. నిరుడు చైనా జీడీపీ 6.9 శాతంగా ఉన్నది. 

ఈ ఏడాది కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపథంలోనే పయనించగలిగినా వాణిజ్యపరమైన ఆందోళనలు తీవ్ర సమస్యల్నే తెచ్చిపెడతాయని ఐఎంఎఫ్ పేర్కొన్నది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా - చైనా - ఈయూ మధ్య వాణిజ్య యుద్ధం, మార్కెట్ల ఒత్తిళ్లు తీవ్ర ప్రభావితం చేస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వాణిజ్య యుద్ధాల వంటివి ప్రతిబంధకాలుగా మారుతాయని హెచ్చరించింది.

ప్రపంచ వృద్ధిరేటు ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో 3.9 శాతంగా ఉండవచ్చునని పేర్కొన్నది. దాదాపు అన్ని అగ్ర దేశాల వృద్ధిరేటు అంచనాల్ని ఈ డబ్ల్యూఈవో అప్‌డేట్‌లో మార్చేసింది. యూరోజోన్‌లోని జర్మనీ, ఫ్రాన్స్‌తోపాటు జపాన్, బ్రిటన్ జీడీపీ వృద్ధి అంచనాల్ని కూడా ఈసారి ఔట్‌లుక్‌లో సవరించింది. అర్జెంటీనా, బ్రెజిల్ వృద్ధి అంచనాల్నీ తగ్గించిన ఐఎంఎఫ్.. ఇందుకు కారణం ఈ ఏడాది ప్రథమార్ధంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితులేనని పేర్కొన్నది.

అమెరికా జీడీపీ ఇప్పటికీ వృద్ధి దిశగానే పయనిస్తున్నదని, ఈ ఏడాది 2.9 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇటీవల డాలర్ ఐదు శాతం పెరిగిందని గుర్తు చేసింది. వ్రుద్ధిరేటును గాడిలో పెట్టేందుకు ద్రవ్యోల్బణం, మారకం విలువల ఒత్తిళ్ల మధ్య అర్జెంటీనా, ఇండోనేషియా, మెక్సికో, టర్కీ తదితర దేశాలు తమ ద్రవ్యపరపతి పాలసీ రేట్లు పెంచాయి. యూరోజోన్, జపాన్, బ్రిటన్ దేశాల్లో ఆర్థిక వ్రుద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్ సవరించింది. 

loader