కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న దేశాలకు అండగా నిలిచేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం నాటికి 70 దేశాలకు అత్యవసర నిధుల కింద 25 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు సంస్థ అధికార ప్రతినిధి గ్యారీ రైస్‌ వెల్లడించారు. ఈ నిధులను కేవలం కొన్ని రోజుల్లో ఆయా దేశాలకు అందించినట్లు తెలిపారు.

‘రోజుల వ్యవధిలోనే దేశాలకు ఈ అత్యవసర సాయాన్ని దేశాలకు అందించగలిగాం. ఐఎంఎఫ్ నిబంధనలను అమలుచేయకుండా ఈ సాయం చేశాం. నర్సులు, వైద్యుల జీతాలు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన వస్తువులు, వైద్య సామగ్రి సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని వినియోగించాలి’ అని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గ్యారీ రైస్ తెలిపారు.

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఏడు దేశాలకు 1.5 బిలియన్‌ డాలర్ల సాయం అందజేశామని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గ్యారీ రైస్ పేర్కొన్నారు. సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంతంలోని 28 దేశాలకు 10 బిలియన్‌ డాలర్లు అందించామని తెలిపారు. 

ఇప్పటి వరకు దాదాపు 100 దేశాలు అత్యవసర నిధుల కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంస్థ అత్యవసర నిధిని రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. తాము విడుదల చేసిన నిధులను కరోనా వైరస్ నియంత్రణ కోసం పని చేస్తున్న వైద్య సిబ్బందికి వేతనాలిచ్చేందుకు ఉపయోగంచాలని తెలిపారు. వైద్య పరికరాలను వాడటానికి వాడాలన్నారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1930 నాటి ఆర్థిక మాంద్యం కంటే తీవ్రమైన మాంద్యం ఏర్పడిందని గత ఏప్రిల్ మధ్యలో ఐఎంఎఫ్ పేర్కొంది. 2020లో మూడు శాతం ప్రపంచ జీడీపీ పడిపోతుందని అంచనా వేసింది. 

గత నెలలో ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టియానా జార్జివా మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వ్రుద్దిరేటు మరింత పతనం అవుతుందన్నారు. వచ్చేవారం పూర్తి నిర్ధారణలతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పరిస్థితిని ఐఎంఎఫ్ వెల్లడించనున్నది.