ముంబై: అప్పులతో కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌‌ను ఆ కష్టాల నుంచి కొంతమేరైనా గట్టెక్కించడానికి బ్యాంకర్ ఉదయ్ కొటక్ సారథ్యంలోని సంస్థ నూతన బోర్డు నడుం బిగించింది. ఈ క్రమంలో సంస్థల విక్రయానికి కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా అనుబంధ కంపెనీల్లో వాటాల విక్రయానికి సిద్ధమైంది. తాజాగా రెండు అనుబంధ కంపెనీల్లో తనకున్న వాటా మొత్తాన్ని కొనుగోలు చేయటానికి ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని కోరుతూ ప్రకటనలు జారీ చేసింది. 

బిడ్లను దాఖలు చేసేందుకు సంస్థ బోర్డు ప్రతిపాదించిన సంస్థల్లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఐఎస్‌ఎస్‌ఎల్‌), ఐఎస్‌ఎస్‌ఎల్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఐఎస్‌టీఎస్‌ఎల్‌) ఉన్నాయి. డెరివేటివ్స్‌ విభాగంలో క్లియరింగ్‌ సేవలు, ఇతర పలు రకాల ఆర్థిక సేవలు అందించే సంస్థ అయిన ఐఎస్‌ఎస్‌ఎల్‌లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు 81.24% వాటా ఉంది. అదేవిధంగా ఐఎస్‌టీఎస్‌ఎల్‌ కమెడిటీ డెరివేటివ్స్‌ విభాగంలో క్లియరింగ్‌ సేవలు అందిస్తోంది. ఇది నూరుశాతం ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ అనుబంధ కంపెనీ. 

ఐఎస్‌ఎస్‌ఎల్, ఐఎస్‌టీఎస్‌ఎల్‌ సంస్థల్లో వాటా కొనుగోలు చేయదలచిన సంస్థలు ఈ నెల 23లోగా దరఖాస్తు చేయాలని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కోరింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నాటికి దాదాపు రూ.94,000 కోట్ల రుణభారం ఉంది. గడువు తీరిన అప్పులు కట్టలేకపోవటం, కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ  బోర్డును తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయటం తెలిసిన విషయమే.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్ ఛైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌ సారథ్యంలో ఏర్పడిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కొత్త బోర్డు రుణ భారాన్ని తగ్గించే యత్నాల్లో భాగంగా కొన్ని సంస్థల ఆస్తులు, వాటాల విక్రయ యోచన చేస్తుందన్న అంచనాలకు అనుగుణంగా ఇప్పుడు ఆ ప్రక్రియే ప్రారంభమైంది. ఐఎస్‌ఎస్‌ఎల్‌ను కొనుగోలు చేయటానికి ఈ ఏడాది జులైలో ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఆసక్తి చూపింది. ఆ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ ఈలోపు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వెలుగులోకి రావటంతో ఆ లావాదేవీ రద్దయింది. దీంతో ఇతరులకు విక్రయించటానికి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ సంస్థను విక్రయించటం ద్వారా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ లభించే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థల విక్రయం అనుకున్నట్లుగా సజావుగా సాగితే, ఆ తర్వాత మరికొన్ని అనుబంధ సంస్థల్లో వాటాలు గానీ, ప్రాజెక్టులు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిల్‌కౌంటీ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీపీఎల్‌), ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఈసీసీఎల్‌) ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (గతంలో మేటాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు ఈ నెల మొదట్లోనే రాజీనామా చేశారు. దీనికి కారణాలు తెలియరాలేదు. ఈ కంపెనీ ఛైర్మన్‌ కరుణాకరన్‌ రామ్‌చంద్‌ గత నెల 29న తన పదవికి రాజీనామా చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ మకుంద్‌ సప్రే, తన ఎండీ పదవికి, బోర్డు డైరెక్టర్‌ పదవికి ఈ నెల 2న రాజీనామా చేశారు. అంతకు ముందే బోర్డు సభ్యులైన దేవవ్రత సర్కార్‌, సుతాప బెనర్జీ కూడా రాజీనామా చేశారు. కొత్తగా చంద్రశేఖర్‌ రాజన్‌ బోర్డులోకి వచ్చారు.

హిల్‌కౌంటీ అపార్ట్‌మెంట్లు విక్రయిస్తున్న యాక్సిస్‌ బ్యాంకు 
మరోపక్క హిల్‌కౌంటీ ప్రాపర్టీస్‌కు హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఉన్న హిల్‌కౌంటీ ప్రాజెక్టులో 26 అపార్ట్‌మెంట్లను యాక్సిస్‌ బ్యాంకు విక్రయిస్తోంది. ఈ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడటంతో అపార్ట్‌మెంట్లను అమ్మటానికి యాక్సిస్‌ బ్యాంకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

ఈ నెల 24న ఈ-వేలం ద్వారా వీటిని యాక్సిస్ బ్యాంక్ విక్రయించనుంది. హిల్‌కౌంటీ హౌసింగ్‌ ప్రాజెక్టును ఎప్పుడో పదేళ్ల క్రితం ఈ కంపెనీ మేటాస్‌ ప్రాపర్టీస్‌గా రామలింగరాజు ప్రమోటర్‌గా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు సగంలో ఉండగా సత్యం ఖాతాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో దీని ప్రమోటర్‌గా రాజు స్థానంలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ లిమిటెడ్‌ వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా పరిస్థితులు మారలేదు. ఈ హౌసింగ్‌ ప్రాజెక్టులో ఇంకా విక్రయాలు పూర్తి కాలేదని తెలుస్తోంది.