స్టోర్ ప్రారంభం కాగానే లోపలికి వెళ్లడానికి జనం ఎగబడ్డారు. దీంతో ఒక దశలో అక్కడ తొక్కిసలాట జరిగే పరిస్థితి కనిపించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా పేరొందిన స్వీడిష్ కంపెనీ ఐకియా.. భారత్ తొలి స్టోర్ ని ప్రారంభించింది. అది కూడా హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్టోర్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగరవాసులు.. స్టోర్ ప్రారంభం అయిందని తెలియగానే తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.

హైటెక్ సిటీ ప్రాంతంలో ఏర్పాటైన ఈ స్టోర్‌ను సందర్శించేందుకు తొలి రోజే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. దీంతో మాదాపూర్ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయింది. స్టోర్ ప్రారంభం కాగానే లోపలికి వెళ్లడానికి జనం ఎగబడ్డారు. దీంతో ఒక దశలో అక్కడ తొక్కిసలాట జరిగే పరిస్థితి కనిపించింది. 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ఐకియా స్టోర్‌లో మొత్తం 7500 వస్తువులు ఉన్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అందులో దాదాపు వెయ్యి వస్తువులు రెండు వందల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
ప్రారంభం సందర్భంగా రాయితీలు, బహుమతులు అందిస్తున్నారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో చేరవేయడంతో కూడా జనరద్దీ పెరిగేందుకు కారణాలుగా నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారాంతపు రోజుల్లో రద్దీ మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
