ఫర్నిచర్ రిటైలర్ ఐకియా ఇండియా మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం ర.720.1 కోట్లకు పెరిగిందని  రెగ్యులేటరి డాక్యుమెంట్స్ ప్రకారం తెలిపింది.

2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.685.4 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ టోఫ్లర్ షేర్ చేసిన కంపెనీల రిజిస్ట్రార్ ఫైలింగ్ లో  తెలిపింది.

అయితే ఐకియా ఇండియా నికర అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.343.7 కోట్ల నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 64.68 శాతం పెరిగి రూ.566 కోట్లకు చేరుకున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో దీని మొత్తం ఆదాయం 63.18 శాతం పెరిగి రూ.665.6 కోట్లుగా ఉంది, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.407.9 కోట్లు.

ముంబైలో ఈ నెలలో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన ఐకియా ఇండియా, ఎఫ్‌వై 20లో 'ఇతర ఆదాయం' నుండి వచ్చే ఆదాయం రూ.99.6 కోట్లుగా ఉండగా, ఎఫ్‌వై 19లో రూ.64.2 కోట్లుగా ఉంది.

also read వరుసగా 2వ ఏడాది కూడా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా: వాణిజ్య మంత్రిత్వశాఖ ...

 ఐకియా సంస్థకు భారతదేశం ఒక ముఖ్యమైన మార్కెట్ అని, వినియోగదారులకు ఓమ్నిచానెల్ అనుభవాన్ని అందించడానికి పెట్టుబడి పెడుతోందని అని ఐకియా ఇండియా సిఎఫ్ఓ ప్రీత్ ధూపర్ అన్నారు.
    
ఇంగ్కా గ్రూపులో భాగమైన ఐకియా ఇండియా తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ని 2018 ఆగస్టులో హైదరాబాద్‌లో ప్రారంభించింది, తరువాత ఆన్‌లైన్ స్టోర్లు ముంబై, హైదరాబాద్, పూణేలలో ప్రారంభించింది.

నవీ ముంబైలో ఐకియా కొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్‌తో పాటు నగరం నుండి వచ్చే డిమాండ్‌ను తీర్చడానికి ఐకియా ముంబైలో రెండు సిటీ సెంటర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఐకియా ఆన్‌లైన్ వ్యవస్థలో కూడా పెట్టుబడులు పెడుతోంది, 2022 నాటికి 100 మిలియన్ భారతీయ కస్టమర్లను తన ఓమ్నిచానెల్ విధానం ద్వారా చేరుకోవాలనే లక్ష్యంగా ఉంది.

"ప్రస్తుత ఛానెళ్లలో, కొత్త ఛానెల్స్, యూనిట్లను తెరవడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలపై కంపెనీ దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, ఢీల్లీ ఎన్‌సిఆర్ నగరాలపై దృష్టి సారించింది. రిటైల్ వ్యాపారం, ఫర్నిచర్ పరిశ్రమకు సంబంధించిన వివిధ నిబంధనలు, చట్టాలతో కంపెనీ ప్రభుత్వ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో చురుకుగా నిమగ్నమై ఉంది" అని తెలిపింది.

30 దేశాలలో 378 ఐకియా స్టోర్లను నిర్వహిస్తున్న ఐకియా ఫ్రాంచైజ్ వ్యవస్థలో ఇంగ్కా గ్రూప్ ఒక వ్యూహాత్మక భాగస్వామి. ఇంగ్కా గ్రూపుకు మూడు వ్యాపార ప్రాంతాలు ఉన్నాయి. అవి ఐకియా రిటైల్, ఇంగ్కా ఇన్వెస్ట్‌మెంట్స్ మరియు ఇంగ్కా సెంటర్స్.