Asianet News TeluguAsianet News Telugu

వేరీజ్ చందాకొచ్చర్?!: రసా‘బాస్’గా ఐసీఐసీఐ ఏజీఎం

ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందాకొచ్చర్ పనితీరుపై బ్యాంకు వాటాదారుల వార్షిక సమావేశంలో పలువురు వాటాదారులు ప్రశ్నించారు. అసలు బ్యాంకులో సుపరిపాలన అమలవుతున్నదా? అని ప్రశ్నించారు. ఇప్పటిదాక ఆమెను బ్యాంక్ సీఈఓ, ఎండీగా ఎందుకు కొనసాగించారని నిలదీశారు.

ICICI Bank AGM: Shareholders Question Governance, Seek Clarity On Chanda Kochhar Probe
Author
Baroda, First Published Sep 13, 2018, 12:09 PM IST

దేశంలోనే అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చంద్రా కొచ్చర్‌ పట్ల బ్యాంక్‌ వాటాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోకాన్‌ రుణ కేసులో చందా కొచ్చర్‌ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఐసిఐసిఐ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

వాస్తవాలను వెల్లడించేందుకు చందాకొచ్చర్‌ను వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) రప్పించి ఆమె వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఒకవైపు ఆమె హయాంలో బ్యాంకు లావాదేవీలపై విచారణ జరుగుతుండగా, అదే పదవిలో కొనసాగించడంపైనా సందేహాలు వ్యక్తం చేశారు. 

దీనికి తోడు బ్యాంకు ప్రయోజనాలను కాపాడే విషయంలో బోర్డు పారదర్శకంగా వ్యవహరించడం లేదని వాటాదారులు మండిపడ్డారు. సుపరిపాలనను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు పట్టించుకోవడం లేదన్న విమర్శ వచ్చింది. వీడియోకాన్‌ రుణ వివాద విచారణ పూర్తయ్యే వరకు చందా కొచ్చర్‌ను సెలవులోనే కొనసాగించాలని బోర్డు ఇది వరకే నిర్ణయించింది. దీంతో కొచ్చర్‌ బుధవారం జరిగిన 24వ వార్షిక సాధారణ సమావేశానికి హాజరు కాలేదు. 

వాస్తవానికి ఐసీఐసీ బ్యాంక్‌ తన ఏజీఎం గత నెల 10నే జరగాల్సి ఉంది. కానీ బ్యాంకు సీఈవోపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర విచారణకు ఆదేశించేందుకు గాను ఈ సమావేశాన్ని దాదాపు నెల పాటు యాజమాన్యం ఏజీఎం సమావేశాన్ని వాయిదా వేసింది.

బుధవారం తొలిసారిగా ఐసిఐసిఐ బ్యాంకు నూతన చైర్మన్‌ చతుర్వేది ఆధ్వర్యంలో తొలిసారి ఈ సమావేశం జరిగింది. కొచ్చర్‌ కేసులో తమ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకడం లేదని వాటాదారుల మండిపడ్డారు. బ్యాంక్‌లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని వారు బోర్డును హెచ్చరించారు..

కొచర్‌ పనిని బోర్డు నిర్వహించలేదని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. వాటాదారుల ప్రశ్నలపై బ్యాంక్ సీఓఓ, తాత్కాలిక సీఈఓ సందీప్ బక్షి స్పందిస్తూ వివాదం నుంచి బ్యాంకు బయట పడుతుందని వివరణ ఇచ్చారు.

చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు లబ్ది చేకూరేలా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీచేసిట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. 2008లో వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌, మరో ఇద్దరు కలిసి న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ సంస్థను ఏర్పా టు చేశారు.

ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల రుణం అందుకున్నారు. కొన్ని నెలలకే నూపవర్‌లోని రూ.64 కోట్ల విలువ చేసే షేర్లను ధూత్‌ కేవలం రూ.9 లక్షలకే దీపక్‌కు ఇచ్చేసి ఆయనకే అన్ని బాధ్యతలను అప్పగించేశారు. దీంతో అనుమానాలు పెలుబుకాయి.

ధూత్‌కు కొచ్చర్‌ ఐసీఐసీఐ నుంచి రుణ మంజూరు విషయంలో మేలు చేసినందునే.. దూత్‌ కొచ్చర్‌ కుటుంబానికి మేలు చేసేలా షేర్ల బదిలీ జరిపినట్టుగా వాటాదారులు ప్రధానంగా ఆరోపించారు. సమావేశంలో ఎక్కువ భాగం ఈ అంశంపైనే చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే సెబీ కూడా వివరణ కోరింది.

కేవలం 15 నిమిషాల్లో ఎలా క్లీన్ చిట్ ఇస్తారని, ఇప్పుడు సుదీర్ఘ కాలంగా విచారణ సాగుతున్నదని గుర్తు చేసిన వాటాదారులు సీఈఓ చందాకొచ్చర్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారని వాటాదారులు నిలదీశారు.

మార్చి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చందాకొచ్చర్ కు మద్దతుగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు పట్ల తమకు విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. గమ్మత్తేమిటంటే ఈ ఏజీఎంకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర డైరెక్టర్ కూడా హాజరు కాలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్ నే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థ డైరెక్టర్ల బోర్డులో చేర్చడమేమిటని వాటాదారులు సందేహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios