Asianet News TeluguAsianet News Telugu

ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ‘పాన్’ కార్డు ఇస్తాం

ఆధార్ కార్డుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ‘పాన్’కార్డు జారీ చేస్తామని కేంద్ర ప్రత్యక్ష బోర్డుల మండలి (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర తెలిపారు. అంటే తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ అనుసంధానించాల్సిందేనని స్పష్టం చేశారు. 

I-T will 'suo motu' allot PAN to those only furnishing Aadhaar: CBDT chairman
Author
New Delhi, First Published Jul 8, 2019, 10:32 AM IST

న్యూఢిల్లీ: ‘పాన్‌ కార్డు లేకుండా కేవలం ఆధార్‌ కార్డుతో రిటర్నులు దాఖలు చేసే వారికి నేరుగా కొత్త పాన్‌ కార్డును అందించాలనుకుంటున్నాం. పన్ను చెల్లింపుదారుడికి స్వయంగా పాన్‌ కార్డును ఇచ్చే అధికారాన్ని చట్టం ఇస్తోంది’ అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర చెప్పారు. 

బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా
ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్‌ కోసం పాన్‌ కార్డు తప్పనిసరి కాదని, ఆధార్‌ కార్డు‌తోనూ రిటర్నుల ఫైలింగ్‌ చేయొచ్చని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌.. ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

పాన్ కార్డు లేకున్నా.. ఆధార్ పొందు పరిస్తే సరి
దీంతో పాన్‌ నంబర్‌ను ఇవ్వాల్సిన‌ అవసరమున్న చోట ఆధార్‌ నంబర్‌ను పొందుపరిస్తే సరిపోయే వీలు కలిగింది. దీంతో పాన్‌ కార్డు లేని వారు ఆధార్‌ నెంబర్‌తో వీటిని వేసుకునే అవకాశం వచ్చింది. అయితే, దీనిపై సీబీడీటీ ఛైర్మన్‌ ప్రమోద్‌ చంద్ర స్పందిస్తూ పలు కీలక విషయాలు తెలిపారు. 

ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు అదనపు ఫెసిలిటీ
దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రమోద్ చంద్ర స్పందిస్తూ‘ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోవడం సరికాదు. పాన్‌ కచ్చితంగా మరుగున పడలేదు. అది మనుగడలోనే ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్‌ వేసేవారికి ఇది ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు సౌకర్యం మాత్రమే. పాన్‌ లేకపోతే.. రిటర్నుల ఫైలింగ్‌ ప్రక్రియలో వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా దానికి బదులుగా అవసరమున్న చోట ఆధార్‌ నంబర్‌ పొందుపర్చే సౌకర్యాన్ని కల్పిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి
ఆధార్‌ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేయడం ఇప్పుడు తప్పనిసరి అని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మంది ఆధార్‌ను, 41 కోట్ల మంది పాన్‌ను కలిగి ఉన్నారు. 22 కోట్ల పాన్‌ కార్డులు... ఆధార్‌ కార్డులతో అనుసంధానం అయ్యాయి.

నేడు ఆర్బీఐ భేటీ.. హాజరు కానున్న నిర్మలా సీతారామన్
సోమవారం జరుగనున్న భారతీయ రిజర్వు బ్యాంక్‌ బోర్డు సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరుకానున్నారు. బడ్జెట్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలతోపాటు పలు అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం కృత నిశ్ఛయంతో ఉన్నది.

అదనంగా రూ.6000 కోట్ల ఆదాయ సముపార్జన కేంద్రం టార్గెట్
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే రూ.6 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని చూస్తున్నది. విమాన యానం, బీమా, మీడియా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడంతోపాటు నిధులు లేకసతమతమవుతున్న బ్యాంకింగేతర సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీ)లకు మరింత బూస్ట్‌ నివ్వడానికి పలు కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకున్నది.

ఆర్బీఐ భేటీలో కేంద్రానికి డివిడెండ్ చెల్లింపుపై చర్చించే చాన్స్
ఈ ఏడాది రిజర్వు బ్యాంక్‌ నుంచి డివిడెండ్‌ రూపంలో రూ.90 వేల కోట్లు ఆశిస్తున్నట్లు నిర్మలా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బోర్డు సమావేశంలో డివిడెండ్‌ చెల్లింపులపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. అంతక్రితం ఏడాది ఇచ్చిన రూ.68 వేల కోట్లతో పోలిస్తే 32 శాతం అధికం.

Follow Us:
Download App:
  • android
  • ios