Hyundai India issue: క్షమాపణలు చెప్పిన హ్యుండయ్.. ట్విట్టర్ వేదికగా క్లారిటీ
25 ఏళ్లుగా భారతీయులతో బంధం పెనవేసుకున్నామని, వారిని బాధపెట్టే విషయాలను తాము ఎన్నడూ సహించబోమంటూ క్షమాపణలు కోరింది.
కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుండయ్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా హ్యుండయ్ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యుండయ్ భారత విభాగం చెప్పుకొచ్చింది. హ్యుండయ్ పాకిస్తాన్ విభాగం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనపై భారతీయులు స్పందిస్తూ #BoycottHyundai అనే హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడంతో హ్యుండయ్ సంస్థ దిగొచ్చి క్షమాపణలు కోరింది.
కాశ్మీర్ ఏర్పాటువాదానికి మద్దతిస్తూ ఫిబ్రవరి 5న పాకిస్తాన్ లో సంఘీభావ దినోత్సవంగా జరుపుకుంటారు. పాకిస్తాన్ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి, అమరులైన పాకిస్తాన్ సైనికులకు నివాళులర్పిస్తారు. ఈక్రమంలో హ్యుండయ్ సంస్థకు చెందిన పాకిస్తాన్ విభాగం.. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. “కాశ్మీర్ కోసం త్యాగాలు చేసిన మన సోదరులను స్మరించుకుందాం, స్వేచ్ఛ కాశ్మీర్ కోసం వారికి మద్దతు ఇద్దాం” అంటూ హ్యుండయ్ పాకిస్తాన్ పోస్ట్ పెట్టింది. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్టును చూసిన భారతీయులు అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. దీంతో గంటల వ్యవధిలోనే #BoycottHyundai అనే హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసి హ్యుండయ్ సంస్థ గ్లోబల్ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశారు. కాశ్మీర్ కోసం పాకిస్తాన్ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేమిటి అంటూ ప్రశ్నించారు.
ఇది సరిపోదన్నట్టు.. సంస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నవారిని బ్లాక్ చేసిన హ్యుండయ్ సంస్థ వారి ట్వీట్లను తొలగించింది. దీంతో చిర్రెత్తిన భారతీయులు ఒకానొకదశలో హ్యుండయ్, కియా కార్లను ఇకపై కొనేదిలేదని, మొత్తం సర్దేసుకుని భారత్ నుంచి వెళ్లిపోవాలంటూ ట్వీట్లు చేయడం మొదలెట్టారు. ఆదివారం సాయంత్రానికి ట్విట్టర్ వేదికగా హ్యుండయ్ సంస్థపై భారతీయులు దండయాత్రే చేశారు. దీంతో తప్పు గ్రహించిన హ్యుండయ్ సంస్థ దెబ్బకు దిగొచ్చి భారతీయులకు క్షమాపణలు చెప్పింది.
25 ఏళ్లుగా భారతీయులతో బంధం పెనవేసుకున్నామని, వారిని బాధపెట్టే విషయాలను తాము ఎన్నడూ సహించబోమంటూ క్షమాపణలు కోరింది. వెంటనే పాకిస్తాన్ విభాగం చేసిన ట్వీట్ ను తొలగించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ మోటార్స్ 25 ఏళ్లుగా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తుంది. కార్ల అమ్మకాల్లో సంస్థకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్. హ్యుండయ్ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ కూడా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తుంది. భారత్ నుంచే దక్షిణ అమెరికా దేశాలకు, మధ్య ఆసియ దేశాలకు కార్లను ఎగుమతి చేస్తుంది హ్యుండయ్ సంస్థ.