ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులను ద్రుష్టిలో పెట్టుకుని సంస్థలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. తాజాగా యూరప్‌లో అతి పెద్ద బ్యాంకింగ్ సర్వీసుల దిగ్గజం హెచ్ఎస్‌బీసీ సైతం త్వరలో ఉద్యోగులకు భారీగా షాక్ ఇవ్వనున్నదని సమాచారం.

హెచ్ఎస్‌బీసీ నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తున్నట్లు ప్రముఖ పత్రిక ఫైనాన్సియల్ టైమ్స్ తెలిపింది. ఎక్కువ శాతం ఉన్నత ఉద్యోగాల్లోనే కోత విధించే అవకాశం ఉన్నదని సంస్థ ప్రతినిధులు తెలిపారని ఆ పత్రిక పేర్కొంది.

నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటనలో హెచ్ఎస్‌బీసీ ఈ ప్రకటనను నిర్ణయించనున్నట్లు సమాచారం. ఆగస్టు నెలలో సంస్థ సీఈఓగా జాన్ ఫ్లింట్ స్థానంలో క్విన్‌ను నియమించింది.

అంతర్జాతీయంగా ముంచుకు వస్తున్న సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎస్‌బీసీ అప్పట్లో ప్రకటించింది. అయితే ముఖ్యంగా కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే వ్యూహాల్లో ఫ్లింట్ విఫలమైనందు వల్లే ఆయన్ను తొలగిస్తూ, హెచ్ఎస్‌బీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్థానంలోకి వచ్చిన క్విన్ పొదుపు చర్యలు చేపట్టారని సమాచారం.