న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో హీరో సైకిల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో చేసుకున్న 900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు.

రాబోయే 3 నెలల్లో ఒప్పందం ప్రకారం చైనాతో 900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉందని.. కానీ ఈ ఒప్పందాన్ని తాము రద్దు చేసినట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ తెలిపారు. చైనా వస్తువుల బహిష్కరణలో తమ నిబద్ధతకు ఇదే నిదర్శనమని చెప్పారు. 

చైనీస్ సంస్థలతో సంబంధాలను రద్దు చేసుకున్నామని, కొత్త మార్కెట్ల కోసం అన్వేషిస్తున్నామని హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ తెలిపారు. యూరప్ మార్కెట్లను అందిపుచ్చుకునే ఉద్దేశంతో జర్మనీలో ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

హీరో ఎలక్ట్రో ఈ-సైకిల్  ప్రాజెక్ట్‌లో 72 శాతం షేర్లు భారత్‌వేనని హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ తెలిపారు. చైనా తీరుపై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సైకిల్ పరిశ్రమకు చెందిన వ్యాపారవేత్తలు వ్యాపార విస్తరణ కోసం వియత్నాం, థాయ్‌లాండ్, తైవాన్ వైపు చూస్తున్నారని పంకజ్ ముంజల్ చెప్పారు.

ఇదిలా ఉంటే భారత్‌లో చేపట్టే 5జీ నెట్‌వర్క్‌  ప్రక్రియలో హువాయి, జడ్‌టీఈ కార్పొరేషన్‌ పాల్గొనకుండా నిషేధించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అఖిలభారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశాయి.

also read కరోనా -వ్యాక్సిన్ పై కన్ఫూజన్: ఐసీఎంఆర్ ప్రకటనపై కేంద్రం క్లారిటీ.. ...

భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, జడ్‌టీఈలను 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనేందుకు అనుమతించరాదని మంత్రికి రాసిన లేఖలో సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. ఈ చైనా కంపెనీలపై అంతర్జాతీయంగా గూఢచర్యం, కుట్ర, మనీల్యాండరింగ్‌ వంటి పలు ఆరోపణలు నమోదయ్యాయని పేర్కొంది.

గల్వాన్‌ ఘటన అనంతరం చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా ప్రశంసించారు. 59 చైనా యాప్‌లను నిషేధించడం.. చైనా కంపెనీలకు అప్పగించిన హైవే, మెట్రో, రైల్వే కాంట్రాక్టులను రద్దు చేయడం వంటి చర్యలను స్వాగతించారు.

జూన్‌ 10న తాము చేపట్టిన బాయ్‌కాట్‌ చైనా ప్రచారానికి అనుగుణంగా జాతి మనోభావాలకు అద్దంపడుతూ ప్రభుత్వం సముచిత చర్యలు చేపట్టిందని అన్నారు. చైనాకు గట్టి సందేశం పంపేలా భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనకుండా హువాయి, జడ్‌టీఈ కార్పొరేషన్‌లను నిషేధించాలని భార్టియా కోరారు.

హువావే, జేటీఎస్ కంపెనీల భాగస్వామ్యాన్ని అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో ఈ కంపెనీల భాగస్వామ్యాన్ని అనుమతించడం లేదని భార్టియా తెలిపారు. భారత్‌లోనూ వాటిని అనుమతించరాదని కోరారు.