న్యూఢిల్లీ: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో భారీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వర్గాల ఆదాయం పన్ను (ఐటీ) పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్లు వినికిడి.

పెద్ద నోట్ల రద్దు.. ఆపై జీఎస్టీ అమలుతో దెబ్బతిన్న ఈ వర్గాలకు ఈ ఉపశమనం కలిగిస్తేనే ఎన్నికల్లో వారి నుంచి ప్రతికూలత రాకుండా తట్టుకోగలమని కేంద్ర ప్రభుత్వ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. వచ్చేనెల ఒకటో తేదీన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టబోయే ఓటాన్‌ అకౌంట్లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదన వెలువడుతుందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. 

ఐటీ పరిమితి పెంపుతో పాటు మెడికల్‌ బిల్లులు, ట్రాన్స్‌పోర్టు అలవెన్సు, విద్యాఫీజు, తదితర అంశాలు పన్ను మినహాయింపు జాబితాలో యథాతథంగా కొనసాగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనం. తాత్కాలిక బడ్జెట్లో భారీ వరాలను ప్రకటించడం ఔచిత్యం కాకున్నా, ఎన్నికల సమయంలో బీజేపీ ఎలాంటి రిస్క్‌ తీసుకోదల్చుకోలేదని ఉన్నతస్థాయి వర్గాలంటున్నాయి.

మధ్యతరగతి సామాజిక వర్గమనేది బీజేపీకి ఉన్న అతి పెద్ద ఓటుబ్యాంకు అనీ, 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ల కల్పన ఒక్కటే సరిపోదనీ, పూర్తిగా సంతృప్తి పర్చాలంటే మెగా రాయితీ ఇవ్వాల్సిందేనని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ రెట్టింపు చేయడానికి ఒకే ఒక ఇబ్బంది.. మరో నెల రోజుల్లో రాబోయే ప్రత్యక్ష పన్నుల కోడ్‌ (డీటీసీ). దీనికి సంబంధించిన నివేదిక ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందే పన్ను రేట్లను మారిస్తే అది వివాదం రేపుతుందని అంటున్నారు. 

ఆదాయాన్నీ, పన్ను విధానాన్నీ పూర్తిగా పునర్నిర్వచించేది ఈ డీటీసీ. మరింత మందిని పన్ను పరిధిలోకి తేవడంతోపాటు వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు సమన్యాయం చేయడం దీని లక్ష్యం. ఇంతవరకూ రూ 2.5 లక్షల దాకా పన్నులేదు. రూ 2.5 లక్షల నుంచి 5 లక్షల దాకా 5 శాతం, 5 నుంచి 10లక్షల ఆదాయం ఉన్నవారికి 20 శాతం, 10 లక్షల పైన ఉన్నవారికి 30 శాతం పన్ను విధిస్తున్నారు.