న్యూఢిల్లీ: ఉద్యోగార్థులకు మంచి రోజులొచ్చాయి. అందునా ఐటీ రంగ నిపుణులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఐటీ రంగంలో బుల్లిష్ ట్రెండ్‌తో గత నెలలో ఉద్యోగ అవకాశాల్లో 21 శాతం మేర వృద్ధి నమోదైందని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ పేర్కొన్నది. అక్టోబర్‌లో 2,088 పాయింట్లు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదేనెలలో నమోదైన 1,728తో పోలిస్తే 21 శాతం పెరిగింది. మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొంది.

అగ్రరాజ్యం అమెరికా వీసాలపై పరిమితులు విధించడంతో గడిచిన కొన్ని నెలలుగా ఐటీ రంగంలో స్తబ్దత నెలకొన్నా, మళ్లీ పురోగతి బాట పట్టడిందని, వచ్చే కొన్ని నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో స్టార్టప్‌లు కీలకపాత్ర పోషించాయని, బ్లాక్‌చెయిన్, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ కూడా తమవంతు పాత్ర పోషించాయని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ అధికారి వీ సురేశ్ తెలిపారు.

ఆయా నగరాల్లో, రంగాల వారీగా చూస్తే ఉద్యోగ అవకాశాలు పొందిన వారు అధికంగా ఉన్నారని నౌకరీ డాట్ కామ్ చీఫ్ సేల్స్ అధికారి  చెప్పారు. మూడేండ్ల లోపు అనుభవం కలిగిన వారికి డిమాండ్ అధికంగా ఉండటంలో వీరిలో వృద్ధి 24 శాతంగా నమోదైంది. అలాగే శిక్షణ పొందిన వారిలో(4-7 ఏండ్ల లోపు) 22 శాతం డిమాండ్ నెలకొంది. 8-12 ఏండ్లలోపు అనుభవం ఉన్నవారి ఉద్యోగ అవకాశాల్లో 18 శాతం పెరుగుదల కనిపించగా, 13-16 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి సిబ్బందిని తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వీరిలో 7 శాతం పెరుగుదల కనిపించింది.

ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగాలు పొందేవారికి నిరాశనే ఎదురైంది. గత ఐదు నెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు అక్టోబర్‌లో 5 శాతం క్షీణించాయి. అయినా ఉత్పాదక, తయారీ రంగాల్లో మాత్రం ఏడాది ప్రాతిపదికన 58 శాతం పెరుగడం విశేషమని మాన్‌స్టార్ ఎంప్లాయిమెట్ ఇండెక్స్ వెల్లడించింది. కంపెనీలు డిజిటల్ బాటపట్టడంతో బీపీవో లేదా ఐటీఈఎస్ సంస్థలు ఆన్‌లైన్ ద్వారా భారీస్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి.

గతేడాదితో పోలిస్తే ఆరోగ్య పరిరక్షణ నిపుణుల్లో  15 శాతం ఎగబాకగా, మానవ వనరులు, అడ్మినిస్ట్రేషన్స్‌లో 11 శాతం, ఫైనాన్స్, అకౌంటెంట్ ఐదుశాతం వరకు ఉద్యోగాలు పెరిగాయి. గతేడాది మే నెల తర్వాత సింగిల్ డిజిట్‌లో వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. ఐటీ (హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్) విభాగాల్లో ఐదు శాతం తగ్గగా, టెలికం/ఐఎస్‌పీలో నాలుగు శాతం తగ్గాయి.