క‌రోనా నేప‌థ్యంలో ఉద్యోగులకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అవ‌కాశం ఇచ్చిన ఐటీ, ప‌లు కంపెనీల‌కు ఇప్పుడు అదే పెద్ద స‌మ‌స్యగా మారింది. క‌రోనా తగ్గిన నేప‌థ్యంలో ఉద్యోగులను ఆఫీస్‌కు ర‌మ్మంటే జాబ్ మానేస్తామ‌ని అంటున్నారు. ఆ వివ‌రాలేంటో చూద్దాం..! 

కరోనా కారణంగా రెండేళ్ల క్రితం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైంది. కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ కారణంగా కంపెనీలు ఎప్పటికి అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగించుకుంటూ వస్తున్నాయి. చాలామంది ఉద్యోగులు అధిక వేతనాల కంటే ఇంటి నుండి పని చేయడానికి అలవాటుపడి ఆ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వివిధ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్ పలికి, ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. అయితే కార్యాలయానికి రావడానికి చాలామంది మొగ్గు చూపడం లేదు. అంతేకాదు, ఆఫీస్‌కు రావడానికి బదులు ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తున్న వారు ఉన్నారు.

వర్క్ ఫ్రమ్ హోం నిలిపివేస్తే 

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు ఇంటి నుండి పనిని నిలిపి వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఉద్యోగులు కార్యాలయానికి రావాలని చెబుతున్నాయి. అయితే కార్యాలయానికి వెళ్లడానికి సుముఖత చూపని చాలామంది ఉద్యోగులు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్టాఫింగ్ రిక్రూట్మెంట్ సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సర్వే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యధిక వేతనాలతో వర్క్ ఫ్రమ్ హోంకు అలవాటుపడిన ఉద్యోగులు ఈ వెసులుబాటు లేకుంటే ఉద్యోగాలన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.

రాజీనామాకు సై 

ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ప్రతి పదిమందిలో ఆరుగురు కార్యాలయానికి వెళ్లడానికి బదులు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ఐటీ, ఔట్ సోర్సింగ్, టెక్ స్టార్టప్స్, కన్సల్టింగ్, బీఎఫ్ఎస్ఐ, బిజినెస్ రంగాల్లోని వారు ఉన్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు మరింత ఎక్కువ వేతనం ఆఫర్ చేసినా దానిని ఆమోదించేది లేదని ఎక్కువమంది చెప్పారు. తమ పని సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగ్గా నిర్వహించుకోవడంతో ఇంటి నుండి పని చేసే పద్ధతికి ఉద్యోగులు అలవాటు పడ్డారని సర్వేలో వెల్లడైంది.

40 శాతం మంది ఇంటి నుండి

620 కంపెనీల‌కు చెందిన 2000 మందిని స‌ర్వే చేశారు. వీరిలో 40 శాతం మంది పూర్తిగా ఇంటి నుండి పని చేస్తున్నారు. 26 శాతం హైబ్రిడ్ మోడ్‌లో వర్క్ చేస్తున్నారు. మిగిలిన ఉద్యోగులు కార్యాల‌యాల నుండి ప‌ని చేస్తున్నారు. ఇన్ఫోసిస్ సీఈవో నారాయణ మూర్తి ఇటీవలే తాను వర్క్ ఫ్రమ్ హోంకు అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఈ పద్ధతి కొనసాగితే ఇనిస్టిట్యూషనల్ కల్చర్ క్రమంగా క్షీణిస్తుందన్నారు.