చెన్నై‌: కొత్తగా కొలువులో చేరిన వారు.. చేతికి వచ్చిందంతా ఖర్చు చేసేసి విలాసాలు చేస్తారనే భావన సహజం. కానీ, వారు పొదుపుకే ప్రాధాన్యం ఇస్తున్నారని బ్యాంక్‌బజార్ డాట్ కాం సర్వే నిగ్గుతేల్చింది. అదే సమయంలో ఇల్లు, కారు కొనేందుకు అవసరమైన రుణాలు తీసుకునేందుకూ పెద్దగా ఇష్టపడటం లేదు.

వ్యక్తిగత రుణాలకూ సాధ్యమైనంత దూరంగానే ఉంటున్నారని తేలింది. క్రెడిట్‌ కార్డులను అధికంగానే ఉపయోగిస్తున్నా అందులో అధిక శాతం జీవనశైలి అవసరాలకే ఖర్చు చేస్తున్నారని బ్యాంక్ బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ పేర్కొంది.

‘ఆస్పిరేషన్‌ ఇండెక్స్‌ 2019’ పేరుతో చేసిన ఈ సర్వేలో 22-45 ఏళ్ల వయసు మధ్య వారు, రూ.30వేలకన్నా తక్కువ ఆదాయం ఉన్న వారిని ఇందులో భాగస్వాములుగా చేశారు. ఆర్థిక లక్ష్యాలు, వాటిని సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వ్యక్తిగత ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం తదితరాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ప్రధానంగా 12 ప్రధాన నగరాల్లో ఈ సర్వే సాగింది. 

తాము సాధించాలనుకుంటున్న ఆర్థిక ఆశయాల పట్ల 86.9శాతం మంది స్పష్టతతో ఉన్నారు. గతంతో పోలిస్తే ఇది పెరిగింది. ఇది మెట్రో నగరాలతో పోలిస్తే.. ఇతర ప్రాంతాల్లోనే అధికంగా కనిపిస్తోంది. మెట్రోల్లో ఆర్థిక లక్ష్య సాధన పట్ల 86.6శాతం స్పష్టత ఉండగా.. ఇతర ప్రాంతాల్లో ఇది 87.4శాతం వరకూ ఉంది. మహిళలతో పోలిస్తే పురుషులు కేవలం ఒక శాతం మాత్రమే ఈ అంశంలో ముందున్నారు. 

ఆరోగ్యం కాపాడుకోవాలని 87.8శాతం మంది అనుకుంటుండగా, కుటుంబ సంబంధాలకు 8.77శాతం, సంపదను సృష్టించాలని 87.5శాతం, ప్రతిష్ట పెంచుకోవాలని 87.3శాతం, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని 84.9శాతం మంది భావిస్తున్నారు. ముఖ్యంగా 28-34 ఏళ్ల మద్య వయస్కుల్లో 88.1శాతం మంది సంపదను సృష్టించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 
35-45 ఏళ్ల వయసు వారు కుటుంబ సంబంధాలకు విలువ ఇస్తున్నట్లు తేలింది. ఇక 22-27 ఏళ్ల వారు తమ ఇమేజీని పెంచుకోవడానికి ఇష్టపడతున్నారు. 

సంపాదించిన వేతనంలో 30శాతానికి మించి నెలసరి వాయిదాలు వేయ కుండానే ఎక్కువ మంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. పదవీ విరమణ ప్రణాళికలను సగటున 29 ఏళ్ల నుంచే ప్రారంభిస్తున్నారు. 56 ఏళ్లకు కనీసం రూ.కోటి - రూ.2కోట్ల వరకూ చేతిలో పెట్టుకొని పదవీ విరమణ చేయాలనే లక్ష్యం చాలామందిలో కనిపించింది. 

రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరులాంటి విషయాలపైనా ఇప్పుడు అవగాహన పెరిగింది. సర్వేలో పాల్గొన్న 85శాతం మందికి పైగా దీన్ని సరిగ్గా చేపట్టాల్సిన అవసరం గురించి స్పష్టమైన అవగాహన కనిపించింది. దేశంలో సగటున సంపాదనలో ఖర్చు 62% ఉంటోంది. 38% పొదుపుకు కేటాయిస్తున్నారు. అదే 28-34 మధ్య ఏళ్ల వయస్కులు 63శాతం ఖర్చు చేస్తున్నారు.

ఇక హైదరాబాద్ నగర పరిధిలో 93% మంది పిల్లలకు మంచి చదువు చెప్పించడమే లక్ష్యంగా పొదుపు, పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. సొంతిల్లు కోసం 92.86%, ఖరీదైన వాహనం కొనుగోలుకు కొనేందుకు 88.43% మంది ప్రయత్నిస్తున్నారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆశతో 88.29% మంది ప్రయత్నిస్తున్నట్లు సర్వేలో తేలింది.