దేశీయ బ్యాంకింగ్ రంగంలో కీలక ఘట్టానికి తెర లేచింది.  HDFC HDFC Bank విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో హెవీ వెయిట్ స్టాక్స్ గా పేరొందిన   HDFC HDFC Bank ఈ విలీనంతో అతిపెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థగా నిలవనుంది. ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్లు బుల్ రన్ జోరందుకుంది. 

దేశీయ కార్పొరేట్‌ రంగంలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ప్రముఖ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, బ్యాంకింగ్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలయిన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌లో విలీనం కానున్నాయి. కాగా ఈ ప్రక్రియకు సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉంది.

HDFC, HDFC Bank విలీన ఒప్పందం ప్రకారం, HDFC బ్యాంక్‌లో HDFCకి 41 శాతం వాటా లభించనుంది. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో విలీనానికి ఆమోదం తెలిపింది. ఈ విలీనంలో కంపెనీ వాటాదారులు, రుణదాతలు కూడా భాగస్వామ్యం కానున్నారు. 

ప్రతిపాదిత ఒప్పందం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హౌసింగ్ లోన్ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడం, ప్రస్తుత కస్టమర్ బేస్‌ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి తెలిపింది. HDFC, HDFC Bankల విలీనం 2024 ఆర్థిక సంవత్సరం రెండవ లేదా మూడవ త్రైమాసికం నాటికి పూర్తవుతుంది.

ఈ విలీనం ద్వారా ప్రతి 25 హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ షేర్లు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ లో రెండు సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. మార్కెట్లో హెవీ వెయిట్ స్టాక్స్ గా పేరున్న ఈ జంట షేర్లు 15 శాతం లాభపడ్డాయి. ఈ రెండు సంస్థల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌, నిఫ్టీ సైతం భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి. 

హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఛైర్మన్ దీపక్ పరేఖ్ మాట్లాడుతూ ఇది సమానుల విలీనం అని అన్నారు. "ఇది పూర్తిగా సమానమైన విలీనం. రెరా అమలు, హౌసింగ్ రంగానికి మౌలిక సదుపాయాల హోదా, అందుబాటు ధరలో గృహాలపై ప్రభుత్వ చొరవ, ఇతర విషయాలతోపాటు, హౌసింగ్ ఫైనాన్స్ వ్యాపారంలో పెద్ద బూమ్ ఉంటుందని మేము నమ్ముతున్నాము. " అని పేర్కొన్నారు. 

దీపక్ పరేఖ్ ఇంకా మాట్లాడుతూ, "గత కొన్ని సంవత్సరాలలో, బ్యాంకులు, NBFCల అనేక నిబంధనలు మెరుగయ్యాయి. ఇది విలీనానికి అవకాశం తెరిచింది. పెద్ద మౌలిక సదుపాయాల రుణాలను పూచీకత్తు చేయడానికి అవకాశం ఇచ్చింది. అలాగే క్రెడిట్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకుంది. సరసమైన గృహాలు ఊపందుకున్నాయి. వ్యవసాయంతో సహా అన్ని ప్రాధాన్యతా రంగాలకు గతంలో కంటే ఎక్కువ క్రెడిట్ లభిస్తోందని పేర్కొన్నారు.