Asianet News TeluguAsianet News Telugu

ఫోర్బ్స్‌ దిగ్గజం రిలయన్స్‌.. హెచ్‌డీఎఫ్‌సీ కూడా బట్ టాప్‌లో చైనా ‘ఐసీబీసీ’

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థల్లో భారత్‌కు చెందిన 57 ఫోర్బ్స్ గ్లోబల్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటి మాత్రమే టాప్ 200లో స్థానం పొందింది. ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) వరుసగా ఏడోసారి అగ్రస్థానంలో నిలిచింది. 

HDFC among 57 Indian companies on Forbes Global 2000 list
Author
New Delhi, First Published Jun 14, 2019, 10:32 AM IST

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్‌ కంపెనీల జాబితాలో దేశీ కంపెనీలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సత్తాను చాటాయి. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదలచేసిన ‘వాల్డ్స్‌ 2,000 లార్జెస్ట్‌ పబ్లిక్‌ కంపెనీస్‌’లో మొత్తం 57 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి.

మొత్తం జాబితాలో ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(ఐసీబీసీ) వరుసగా ఏడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 71వ ర్యాంకును, హెచ్‌డీఎఫ్‌సీ 332వ ర్యాంకును సాధించాయి. ప్రత్యేకించి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో ఆర్‌ఐఎల్‌ 11వ ర్యాంకును పొందగా.. మొదటి స్థానంలో రాయల్‌ డచ్‌ షెల్‌ నిలిచింది. 

కన్సూమర్‌ ఫైనాన్స్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏడో స్థానంలో ఉంది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ రంగంలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచింది. మొత్తం జాబితాలో తొలి పది స్థానాల్లో ఐసీబీసీ, జేపీ మోర్గాన్‌, చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంక్‌, అగ్రికల్చరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, యాపిల్‌, పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌ గ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, రాయల్‌ డచ్‌ షెల్‌, వెల్స్‌ ఫార్గోలున్నాయి.

మరిన్ని భారత కంపెనీల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 209వ స్థానం, ఓఎన్‌జీసీ 220వ ర్యాంక్, ఇండియన్‌ ఆయిల్‌ 288వ స్థానంలో నిలిచాయి. టాప్‌–500లో టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీలకు చోటు దక్కింది.

ఆ తరువాత ర్యాంకులు పొందిన భారత కంపెనీల్లో.. టాటా స్టీల్, కోల్‌ ఇండియా, కొటక్‌ మహీంద్ర బ్యాంక్, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్, యాక్సిస్‌ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, భారత ఎయిర్‌టెల్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌ గ్రిడ్, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, గెయిల్, పీఎన్‌బీ, గ్రాసిమ్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పవర్‌ ఫైనాన్స్, కెనరా బ్యాంక్‌ ఉన్నాయి. 

మొత్తం 61 దేశాలకు చెందిన అతిపెద్ద కంపెనీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ జాబితా విడుదలైందని ఫోర్బ్స్‌ తెలిపింది. 2,000 కంపెనీల తుది జాబితాలో 575 అమెరికా కంపెనీలు.. చైనా, హాంకాంగ్‌ (309), జపాన్‌ (223) కంపెనీలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios