ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలపై GST కొరడా...రూ. 1 లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ
జిఎస్‌టి అధికారులు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఇప్పటి వరకు రూ. 1 లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపారు. పన్నులు చెల్లించనందుకు డ్రీమ్ 11 వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు డెల్టా కార్ప్ వంటి క్యాసినో ఆపరేటర్లకు సైతం నోటీసులు జారీ అయ్యాయి.
పన్ను ఎగవేత కేసుల్లో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు ఇప్పటివరకు రూ. 1 లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి బుధవారం వెల్లడించారు. అయితే, అక్టోబర్ 1 తర్వాత భారతదేశంలో రిజిస్టర్ అయిన విదేశీ గేమింగ్ కంపెనీల డేటా ఇంకా అందుబాటులో లేదని సదరు అధికారి తెలిపారు.
విదేశీ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి
విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి భారత్‌లో నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే GST చట్టాన్ని సవరించింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్‌టీ పన్ను విధిస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్టులో స్పష్టం చేసింది.
గేమింగ్ కంపెనీలు పన్నులు పూర్తిగా చెల్లించలేదని ఆరోపించినందుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. జిఎస్‌టి అధికారులు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఇప్పటి వరకు రూ. 1 లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపారని అధికారి తెలిపారు. పన్నులు చెల్లించనందుకు డ్రీమ్ 11 వంటి అనేక ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు డెల్టా కార్ప్ వంటి క్యాసినో ఆపరేటర్లకు నోటీసులు జారీ అయ్యాయి.
21,000 కోట్ల రూపాయల జిఎస్‌టి ఎగవేతపై గత ఏడాది సెప్టెంబర్‌లో గేమింగ్ ప్లాట్‌ఫామ్ గేమ్స్ క్రాఫ్ట్ కు షోకాజ్ నోటీసు పంపింది. అయితే కర్ణాటక హైకోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం జులైలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్ పీ) దాఖలు చేసింది.