ఆర్థిక సంఘం సూచన నిబంధనల్లో మార్పులు చేయడానికి ముందు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుండేదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు.

15వ ఆర్థిక సంఘం సూచన నిబంధనలను ఈ ఏడాది జూలైలో మోదీ సర్కార్ మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం ఒంటెత్తు పోకడను మన్మోహన్ తప్పుబట్టారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఈ తరహా విధానాలతో రాష్ర్టాల ప్రయోజనాలు దెబ్బ తింటాయని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

శనివారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆర్థిక సంఘం సూచన నిబంధనల్లో మార్పులకు సీఎంల అభిప్రాయ సేకరణ తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. రాష్ర్టాలతో సంప్రదింపులతోనే ఈ ప్రక్రియలు జరుగాలని అన్నారు. 

కేటాయింపుల్లో మిగులు నిధులను రక్షణ, అంతర్గత భద్రతలకు వినియోగించేలా కమిటీ తప్పనిసరిగా సూచించాలని కేంద్రం 15వ ఆర్థిక సంఘం సూచన నిబంధనలను మార్చింది. అలాగే వచ్చే నెల 30 నాటికి కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉండగా, ఈ గడువును నవంబర్ 30కి మార్చారు.