Asianet News TeluguAsianet News Telugu

డ్రాగన్‌ పైనే గురి: ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం..

సరిహద్దుల్లో తూర్పు లడఖ్​లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న ‘డ్రాగన్’ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. చౌక వస్తువులు, నాణ్యతలేని చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించింది. స్వావలంబనను ప్రోత్సహించేందుకు భారత సిద్ధమవుతోంది. ఈ మేరకు పరిశ్రమవర్గాల సమాచారం కోరింది.
 

Govt seeks product wise details from industry to curb cheap low quality import from China sources
Author
Hyderabad, First Published Jun 22, 2020, 3:17 PM IST

న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా.. తక్కువ నాణ్యత కల వస్తువుల దిగుమతుల నియంత్రణ.. ముఖ్యంగా చైనా ఉత్పత్తులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ ధరలు, పన్ను ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకొని వస్తువుల వారీగా చౌక వస్తువుల దిగుమతుల వివరాలు సమర్పించాలని పరిశ్రమ వర్గాలను కోరినట్లు తెలుస్తోంది.

చైనా నుంచి దిగుమతులు తగ్గించటం సహా భారత్‌ స్వావలంబనను ప్రోత్సహించేందుకు ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అవసరమైన సూచనలు చేయాలని పారిశ్రామికవేత్తలను కోరినట్లు సమాచారం.

చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులు, ముడిసరుకులు ప్రధానంగా చేతి గడియారాలు, గోడ గడియారాలు, గాజు బుడ్డీలు, గాజు, రాడ్లు, ట్యూబ్‌లు, హెయిర్‌క్రీమ్స్‌, షాంపులు, పౌడర్లు, సౌందర్య ఉత్పత్తులు, ప్రింటింగ్‌ఇంక్‌, పెయింట్స్‌, వార్నిషెస్‌, పొగాకు ఉత్పత్తులపై పరిశ్రమవర్గాల అభిప్రాయాలతోపాటు సలహాలు కోరినట్లు తెలుస్తోంది.

2014-15 నుంచి 2018-19 మధ్య చైనా దిగుమతుల్లో పెరుగుదల, దేశీయంగా తయారైన అలాంటి వస్తువుల ధరల వివరాలు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం, స్వేచ్ఛావర్తక ఒప్పందాల్లో భాగంగా దిగుమతులు, విలోమ పన్నుల అంశాలపై పరిశ్రమవర్గాల నుంచి.. కేంద్ర ప్రభుత్వం సమాచారం కోరింది.

also read పరస్పర దూషణలు, బెదిరింపులొద్దు.. నెటిజన్లకు రతన్ టాటా సూచన..

ప్రభుత్వం కోరిన అన్నిఅంశాల వివరాలను సిద్ధంచేసి త్వరలోనే వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో డ్రాగన్‌దేశం నుంచి దిగుమతుల నియంత్రణ, తగ్గింపుపై కేంద్రం దృష్టి సారించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది.

మొబైల్ ఫోన్లు, టెలికం, విద్యుత్తు, ప్లాస్టిక్‌బొమ్మలు, ఫార్మా మిశ్రమ పదార్థాలకు చైనా ప్రధాన సరఫరాకు నిలుస్తోంది. టైర్ల దిగుమతులపై ఇప్పటికే ఆంక్షలు  కేంద్రం విధించింది. భారత్‌తో సరిహద్దు కల దేశాల పెట్టుబడులను దేశీయ సంస్థల్లో నియంత్రించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది.

కరోనా నేపథ్యంలో.. ఈ నిర్ణయం చైనా పెట్టుబడులకు అడ్డుకట్ట వేయనుంది. 2019 ఏప్రిల్‌ - 2020 ఫిబ్రవరి మధ్యలో చైనా నుంచి దిగుమతుల విలువ 62.4 బిలియన్‌ డాలర్లు కాగా, అదేకాలంలో భారత్‌నుంచి ఆ దేశానికి ఎగుమతైన వస్తువుల విలువ 15.5 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది.

గోడ గడియారాలు, చేతి గడియారాలు, సంగీత పరికరాలు, బొమ్మలు, ఆట వస్తువులు, ఫర్నీచర్‌, పరుపులు, ప్లాస్టిక్‌, విద్యుత్ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు వస్తువులు, ఎరువులు, ఖనిజ ఇంధనం, లోహాపు వస్తువులుచైనా నుంచి ప్రధానంగా దిగుమతి అవుతున్నాయి.

2019-20ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో చైనాతో వాణిజ్యలోటు 47బిలియన్‌ డాలర్లకు పెరగటంపై భారత్‌ ఆందోళన చెందుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios