Asianet News TeluguAsianet News Telugu

అమ్మకానికి ఎల్‌ఐసీ: ఐపీవో దేనికి..?

ఎల్ఐసీలో పాక్షిక నిధుల ఉపసంహరణకు కారణాలేమిటో పరిశీలించాల్సి ఉంటుంది. 

Govt's plan for partial divestment in LIC met with opposition from employees' union
Author
Hyderabad, First Published Feb 2, 2020, 1:20 PM IST

ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి పెట్టేది. గడువులోగా నిర్దేశిత లక్ష్యం మేరకు వాటాలు అమ్ముడు పోకపోతే, వాటిని ఎల్ఐసీ కొనుగోలు చేసి ఆయా సంస్థలను ఆదుకుంటూ వచ్చింది.

Also read:కేంద్ర బడ్జెట్ 2020: ఎల్ఐసీ ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగులు

ఒక రకంగా ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణకు ఎల్‌ఐసీ పెద్ద దిక్కులాంటిది. ఇప్పుడు ఆ పెద్దదిక్కులోని వాటాలనే ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ నిర్ణయం మార్కెట్ వర్గాలకు.. పెట్టుబడిదారులకు శుభవార్త అయినా.. ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

ఎల్ఐసీలో పాక్షిక నిధుల ఉపసంహరణకు కారణాలేమిటో పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటికీ దేశీయంగా జాతీయ ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ఎల్ఐసీదే ప్రథమ స్థానం. వివిధ పాలసీల ద్వారా సేకరించిన నిధులు.. సంస్థకు ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగానే ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్ఐసీ వాటాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాకు ఇది పెద్ద అసెట్. 

ఆర్థిక మందగమనం ఫలితంగా పన్ను వాటా తగ్గుతోంది. జీఎస్టీ చెల్లింపులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో తమ బలాన్ని స్థిరీకరించుకోవాలంటే కేంద్రానికి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటువంటి పరిస్థితులలో బంగారు బాతులా ఎల్ఐసీ కనిపించింది.

అందుకే ఎల్ఐసీలో పాక్షికంగా పెట్టుబడులను ఉపసంహరించినా భారీ స్థాయిలో నిధులు లభిస్తాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఎల్‌ఐసీ (జీవిత బీమా కార్పొరేషన్‌) వద్ద భారీగా మొండి బాకీలు, తక్కువ రేటింగ్‌ పెట్టుబడులు పోగుబడుతున్నాయి. ఇటువంటివి దాదాపు రూ.67,387 కోట్లకు చేరాయని ఆ సంస్థే ప్రకటించింది. 

2014 తర్వాత ఈ సంస్థ పెట్టుబడులు కూడా భారీగా పెరిగిపోయాయి. నిధుల కొరత ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో వాటాలు కొని ఆదుకొంది. సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఎల్‌ఐసీ రూ.30వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. 

అంతకు ఆరునెలల ముందుతో పోలిస్తే ఇది రూ.5,000 కోట్లు ఎక్కువ. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.24,777 కోట్లుగా ఉన్నాయి. 2015 మార్చి నుంచి సెప్టెంబర్‌ 2019 వరకు 145శాతం పెరిగాయి. ఇవి ప్రమాద ఘంటికలు మొగించినట్లే లెక్క. 

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలహీనమైన పెట్టుబడులు(డౌన్‌గ్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్లు)రూ.23,126 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికే రిలయన్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, ఎస్సార్‌ పవర్‌, స్టెర్లింగ్‌ బయోటెక్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌, డెక్కన్‌  క్రానికల్‌ హోల్డింగ్స్‌ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. దీనికి తోడు ఎల్‌ఐసీ సాల్వెన్సీ రేషియో కూడా సెప్టెంబర్‌ 2019 నాటికి 1.55 నిష్పత్తికి చేరింది. ఇది పరిశ్రమలో అతితక్కువ. 

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్‌ఐసీ పెట్టుబడులు భారీగా 76శాతం పెరిగాయి. మార్చి 2019 నాటికి ఎల్‌ఐసీ రూ.26,61,564 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. 2014లో ఈ మొత్తం కేవలం రూ.15,11,133 కోట్లుగా ఉంది. మోదీ సర్కారు చేపట్టిన పెట్టుబడి ఉపసంహరణల్లో చాలా వాటిని ఇదే ఆదుకొంది. బీహెచ్‌ఈఎల్‌లో 5.94శాతం వాటా.. కోల్‌ ఇండియాలో రూ.7,000 కోట్లు.. 2017 జనవరిలో జీఐసీ, న్యూఇండియా ఎష్యూరెన్స్‌ కార్పొరేషన్‌లో రూ.15,000 కోట్లు, 2018లో ఐడీబీఐలో రూ.13,000 కోట్లు పెట్టి వాటాలు కొనుగోలు చేసింది. 

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను కూడా కష్టాల నుంచి బయటపడేయమని ప్రభుత్వం కోరినా.. మోసపూరిత వ్యవహారాలు ఉండటంతో  వెనుకడుగు వేసింది. ఏటా కనీసం రూ.55వేల కోట్ల వరకు మార్కెట్లలో ఎల్‌ఐసీ పెట్టుబడులు వస్తుంటాయి. ఎల్‌ఐసీకి రూ.4లక్షల కోట్లకు విలువైన డిబెంచర్లలో పెట్టుబడులు ఉన్నాయి. దీతోపాటు మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.3.7లక్షల కోట్ల వరకు మదుపు చేసింది. 

ఎల్‌ఐసీ కనుక మార్కెట్లో లిస్ట్‌ అయితే దేశంలోనే భారీ కంపెనీగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కంపెనీ ఆస్తులు.. పెట్టుబడుల లెక్క చూస్తే తేలిగ్గా ఇప్పుడు ఉన్న అన్ని టాప్‌ కంపెనీలను దాటేస్తుంది. ఈ కంపెనీ మొత్తం పెట్టుబడులే రూ.31.11 లక్షల కోట్లు. 

ఇక 2018 సంవత్సరలో ఎల్ఐసీ లాభం రూ.48,436 కోట్లు. ఈ కంపెనీ మార్కెట్లలో లిస్ట్‌ అయితే కనుక భారీగా విలువ పెరగడం ఖాయం. ఒక్క వాటాల పెట్టుబడులపైనే రూ.25వేల కోట్లకు పైగా లాభం వచ్చింది. ఇంత విలువైన సంస్థను ఎల్‌ఐసీ యాక్ట్‌ 1956 ప్రకారం రూ.5కోట్ల నిర్వహణ మూలధనంతో ప్రారంభించారు..!  

ప్రభుత్వం ఎల్‌ఐసీలో ఎంత శాతం వాటాలను విక్రయిస్తుందనే విషయం కచ్చితంగా చెప్పలేదు. కానీ, 2019లో మాత్రం లిస్టెడ్‌ కంపెనీల్లో 35శాతం ప్రజలకు వాటా ఉండాలనే నిబంధన విధించింది. ఇది వర్తిస్తే కనుక ఆ మేరకు పెట్టుబడుల ఉపసంహరణ జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ కంపెనీ లిస్ట్‌ అయితే పెట్టుబుడుల విషయం బహిరంగా వెల్లడించాలి, దీంతోపాటు నిర్వహణ  కూడా మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.5శాతం లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 3.8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ సారి  ఎయిర్‌ ఇండియా వంటి భారీ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాలు కొలిక్కి రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అందుకే వచ్చే ఏడాది ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణను ఎంచుకొంది.

దీనిలో వాటాలను విక్రయిస్తే భారీ మొత్తం ప్రభుత్వానికి లభిస్తుంది. దీనికి తోడు ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలు కూడా విక్రయిస్తామని పేర్కొంది. అప్పుడు ద్రవ్యలోటును అదుపుచేయవచ్చనేది ప్రభుత్వ వ్యూహం. 

ఎల్‌ఐసీ విక్రయం జాతి ప్రయోజనాలకు భంగకరమని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన అనంతరం స్పందించాయి. ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది జాతి ప్రయోజనాలకు భంగకరం’’ అని ఉద్యోగ సంఘాలు అన్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.

ప్రస్తుతం ఎల్‌ఐసీలో 1,11,979 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘‘ మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ సందర్భంగా ఎల్‌ఐసీ చేత చాల సంస్థల్లో పెట్టుబడులు పెట్టించింది. అవన్నీ నష్టాల్లో ఉన్న సంస్థలు. మేము సంస్థను కొన్ని దశాబ్దాలుగా కాపాడుకొంటున్నాం. ప్రభుత్వ చర్యలను కొనసాగనివ్వం’’ అని దక్షిణ జోన్‌ బీమా ఉద్యోగుల ఫెడరేషన్‌ జాయింట్‌ సెక్రటరీ శివసుబ్రమణియన్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios