న్యూఢిల్లీ: స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షాప్‌క్లూస్‌.. స్మార్ట్ ఫోన్, ఇతర గ్రుహోపకరణాల కొనుగోళ్ల ఆర్డర్లు.. ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ బజార్.. ఇలా అన్ని రకాల లావాదేవీలకు ఆన్ లైన్ వేదికల వైపే చూస్తుంటాం. చివరకు బిల్లులు, రీఛార్జీల చెల్లింపులు చేయాలంటే.. పేటీఎం, మొబిక్విక్‌, ఫ్రీఛార్జీ, ఫోన్‌పే వరకూ ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. 

నోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ సంస్థలపై మోజు 

ప్రస్తుతం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు ప్రత్యేకించి 2016 నవంబర్ ఎనిమిదో తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆన్ లైన్ సంస్థల సేవలు ప్రతి ఒక్కరి జీవితంతో మమేకం అయ్యాయి. దీనికి తోడు ఆన్ లైన్ సంస్థలు ఆఫర్లు, క్యాష్‌ బ్యాక్‌లు ఇవ్వడం లాంటి ప్రయోజనాలతో ప్రజలు వీటికి ఆకర్షితులయ్యారు. అయితే ఇకముందు పరిస్థితి ఉండబోదు. ఆన్‌లైన్‌ సంస్థల భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు గత చరిత్ర కానున్నది! దీనికి కారణం ప్రభుత్వం త్వరలో అమలులోకి తేనున్న ఈ-కామర్స్‌ రంగ విధానమే వీటికి కళ్లెం వేయనున్నది. దేశీయ ఆన్ లైన్ సంస్థలకు లాభాలు చేకూర్చే దిశగా కేంద్రం అడుగులేస్తున్నది. 

ధరలు, ఆఫర్ల తగ్గింపు విషయమై నియంత్రణలు

ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు ఇచ్చే మెగా ఆఫర్ల కోసం ఎదురుచూసే వారికి నిరాశే ఎదురుకావచ్చు. ఇక నుంచి ఇవి భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించకపోవచ్చు. ఎందుకంటే ఆపర్ల రూపంలో ధరలు తగ్గించి విక్రయించడంపై నియంత్రణ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని ఈ-కామర్స్‌ రంగ విధాన ముసాయిదాలో ప్రతిపాదించింది కేంద్రం. అయితే ఎప్పటి నుంచి ఈ నియంత్రణలను అమల్లోకి తేవాలనే విషయంపై ఇంకా ఖచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదు.ఈ-కామర్స్‌ రంగ ముసాయిదా ప్రకారం.. వినియోగదారులను ఆకర్షించే నిమిత్తం ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన భారీ తగ్గింపు ఆఫర్లను ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు ఆపేయాల్సి ఉంటుందని ప్రతిపాదించింది కేంద్రం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలతో పాటు, స్విగ్గీ జొమాటో లాంటి ఆహార సరఫరా వెబ్‌సైట్‌లు, పేటీఎం, పాలసీ బజార్‌లాంటి ఆర్థిక సేవలు అందించే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను కూడా ఈ - కామర్స్ పాలసీ పరిధిలోకి రానున్నాయి.

తాజా పాలసీతో బీ2సీ పరిధిలోకి ఆన్‌లైన్ సంస్థలు

బీ2సీ ఈ-కామర్స్‌ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 49 శాతంగా ఉండాలని కూడా ముసాయిదాలో కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీ2బీ ఈ-కామర్స్‌ వ్యాపారంలో ప్రస్తుతం 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. బీ2సీ విభాగంలో ఆ వెసులుబాటు లేదు. అయితే ఈ నిబంధనలతో  ప్రస్తుతం దిగ్గజ ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలన్నీ కూడా బీ2బీ కిందకు వస్తున్నాయి. ఎందుకంటే వీటి ప్లాట్‌ఫాంపై విక్రయదార్లు వస్తువులు, సేవలను అమ్ముకునేందుకు వీలు కల్పించి అందుకు ప్రతిగా ఇవి కమీషన్‌ను పొందుతున్నాయి. 

నియంత్రణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ప్రత్యేక వింగ్
ఆన్‌లైన్ సంస్థలు నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించకుండా లొసుగులను వాడుకుంటూ వస్తువుల నిల్వ కోసం ఇవి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతోపాటు థర్డ్‌ పార్టీ విక్రయదార్లుగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి కార్యకలాపాలకూ అడ్డుకట్ట వేయాలని ముసాయిదాలో నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ఈ-కామర్స్‌ రంగంలో నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలను చూసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో ఓ ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసేందుకూ సిఫారసు చేసింది.

శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల వెలుగులోనే ఈ - కామర్స్ ముసాయిదా

వ్యక్తిగత వివరాల భద్రత బిల్లు- 2018 ముసాయిదాను జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇటీవల సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కీలక సమాచారాన్ని భారత్‌లో ఉన్న కేంద్రాల్లోనే నిక్షిప్తం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ-కామర్స్‌ విధాన ముసాయిదాను కూడా ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే రూపొందించినట్లు వాణిజ్య కార్యదర్శి (డిజిగ్నేట్‌) అనుప్‌ వాదవాన్‌ తెలిపారు. ఈ-కామర్స్‌ విధాన ముసాయిదా రూపకల్పన నిమిత్తం ఓలా, స్నాప్‌డీల్‌, మేక్‌ మై ట్రిప్‌, అర్బన్‌ క్లాప్‌, జస్ట్‌డయల్‌ ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీని కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండో సమావేశం సోమవారం జరిగింది. దేశీయంగా వివరాల భద్రతకు  కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించే విషయంపైనా ఇందులో చర్చించారు. 

దేశీయ సంస్థలకు లబ్ధి చేకూర్చడమే సర్కార్ లక్ష్యం

‘వ్యాపారం సాఫీగా జరిగేలా వీలు కల్పించడంతో పాటు భద్రత, గోప్యత ఆందోళనలు తొలగించేలా ఓ విధానంతో ముందుకు వస్తాం’ అని వాదవాన్‌ తెలిపారు. వివరాల మార్పిడి, భద్రత, సమస్యల పరిష్కారం, స్థానికంగా వివరాలను భద్రపరచడం తదితరాలకు సంబంధించి ఈ-కామర్స్‌ విధాన ముసాయిదాలో విస్త్రృత సిఫారసులను నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ప్రజాభిప్రాయ నిమిత్తం త్వరలోనే ఈ విధాన తొలి ముసాయిదాను అందుబాటులోకి తెస్తారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా దేశీయ ఈ-కామర్స్‌ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా విధానం ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఇందులో రక్షణాత్మక విధానాలకు తావు లేకుండా చూడాలని భావిస్తోంది.