కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులను VPN (Virtual private network) సేవలను వాడకుండా  నిషేధించింది. ఇప్పటికే వీపీఎన్ సేవలను అందిస్తున్న Nord VPN, ExpressVPN, Tor వంటి కంపెనీలు అందించే థర్డ్-పార్టీ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (VPN) సేవలను ప్రభుత్వం ఉద్యోగులు ఉపయోగించకుండా నిషేధించింది.

కేంద్ర ప్రభుత్వం VPN (Virtual private network) సర్వీసులపై కొరడా ఝుళిపించింది. ఇకపై ప్రభుత్వం ఉద్యోగులు వీపీఎన్, క్లౌడ్ సర్వీసులను వాడకుండా నిషేధించింది. ఇప్పటికే వీపీఎన్ సేవలను అందిస్తున్న Nord VPN, ExpressVPN, Tor వంటి కంపెనీలు అందించే థర్డ్-పార్టీ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (VPN) సేవలను ఉపయోగించకుండా ప్రభుత్వం ఉద్యోగులకు నిషేధించింది.

భారతదేశంలో VPN కంపెనీలు ఎలా పనిచేయాలి అనే దానిపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఆదేశాలను అనుసరించి దేశంలో తమ సేవలను అందించడాన్ని నిలిపివేస్తామని ఎక్స్‌ప్రెస్‌ విపిఎన్, సర్ఫ్‌షార్క్, నార్డ్‌విపిఎన్ చెప్పిన కొద్ది రోజులకే ఈ ఆదేశం వచ్చింది.

"గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్‌బాక్స్ వంటి ఏదైనా ప్రభుత్వేతర క్లౌడ్ సర్వీస్‌లో సైతం ఏదైనా అంతర్గత, పరిమితం చేయబడిన లేదా గోప్యమైన ప్రభుత్వ డేటా ఫైల్‌లను" సేవ్ చేయవద్దని ఆదేశం ప్రభుత్వ ఉద్యోగులను కోరింది.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), ప్రభుత్వ శాఖల్లో సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడానికి తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 


ఇదిలా ఉంటే వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) సర్వీస్‌ ప్రొవైడర్లు కొత్త మార్గదర్శకాలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం గతంలోనే తేల్చి చెప్పింది. ఎవరైతు పాటించడానికి సిద్ధంగా లేరో వారు భారత్‌ నుంచి నిష్క్రమించవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. దేశంలో నిబంధనలు, చట్టాలను పాటించమని చెప్పే అవకాశం ఎవరికీ లేదన్నారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, అలా కుదరదనుకుంటే సర్వీసులను నిలిపివేయవచ్చని పేర్కొన్నారు.

 క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, వీపీఎన్‌ సంస్థలు, డేటా సెంటర్‌ కంపెనీలు, వర్చువల్‌ ప్రైవేటు సర్వర్‌ ప్రొవైడర్లు యూజర్ల డేటాను కనీసం ఐదేళ్ల పాటు తప్పనిసరిగా భద్రపరచాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమ సిస్టమ్‌లో సైబర్‌ దాడి గురించి తెలుసుకున్న 6 గంటల్లోగా సంస్థలు నివేదించాలన్న నిబంధనలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయబోదని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. సైబర్‌ దాడి ఘటనలను నివేదించడానికి సంబంధించిన భారత ప్రభుత్వ ఆదేశాలను పునఃపరిశీలించాలని అమెరికాకు చెందిన టెక్నాలజీ పరిశ్రమ సంఘం ఐటీఐ కోరుతోంది. ఇందులో గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎం, సిస్కో వంటి గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాలు సభ్యులుగా ఉన్నాయి.