Asianet News TeluguAsianet News Telugu

చిన్న రుణాలా?! వెయిట్ అండ్ సీ.. ‘మొండి బాకీలపై’ బ్యాంకర్ల ముందుచూపు!!

ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. చిన్న రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవు. ఒకవేళ ఇచ్చినా మొండిబకాయిల సమస్య వెంటాడుతుందన్న భయాందోళనలు చుట్టుముట్టాయి. కరోనా​ ప్రభావంతో బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సిబిల్​ నివేదిక వెల్లడించింది.

governments emergency credit line guarantee scheme forhelping the micro,small and medium enterprise(msme)sector
Author
Hyderabad, First Published Jun 12, 2020, 10:39 AM IST

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒక పక్క నగదు లభ్యత మెరుగ్గా ఉన్నా.. చిన్న రుణాల విషయంలో బ్యాంకులు దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు ఇస్తే.. మొండి బకాయిల సమస్య పెరగొచ్చని బ్యాంకులు భయపడుతున్నట్లు సిబిల్‌ నివేదిక వెల్లడించింది. 

వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులకు మంచి గిరాకీ ఉన్నా.. రుణదాతలు ఈ విభాగాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని, ఆస్తుల నాణ్యతపై ఆందోళనలే ఇందుకు కారణమని ‘సిబిల్’ పేర్కొన్నది. రిటైల్‌ రుణాల వృద్ధి కోసం బ్యాంకులు నష్టభయం తక్కువగా ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి.

అయితే గృహాలు అందుబాటు ధరలో లేకపోవడం, ఆర్థిక పరిస్థితులతో కొనుగోలుదార్లు వాయిదా వేసుకోవడం వంటి కారణాలతో ఈ రుణాలకు గిరాకీ భారీగా తగ్గనుందని సిబిల్‌ అభిప్రాయపడింది. 2008-09 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులను, తాజా ఆర్థిక గణాంకాల అంచనాలపై సిబిల్ నివేదిక వెలువరించింది.

'భారత ప్రభుత్వం కొవిడ్‌-19 ప్రభావాన్ని తగ్గించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. అయితే వీటి ప్రభావం అంతంతమాత్రమే. దీని వల్ల మొత్తం రిటైల్‌ రుణాల మార్కెట్‌ తీరుతెన్నులు మారిపోవడానికి దారితీయొచ్చు' అని సిబిల్‌ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ విభాగం ఉపాధ్యక్షుడు అభయ్‌ కేల్కర్‌ పేర్కొన్నారు.

కరోనా తర్వాత వినియోగదారుల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయాయని, ఎక్కువ శాతం మంది వేతన కోతలు, ఉద్యోగాలు కోల్పోవడం చవిచూస్తున్నారని నివేదిక పేర్కొంది. ఫలితంగా వినియోగదారుడి సెంటిమెంట్‌ దెబ్బతిందని, గిరాకీ, వ్యయాలపై ప్రభావం పడిందని వెల్లడించింది.

భవిష్యత్‌లో రిటైల్‌ రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యతపై సైతం ప్రస్తుత సంక్షోభ పరిస్థితి ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. భద్రత లేని రుణాల ఆస్తుల నాణ్యత దారుణంగా తగ్గొచ్చని విశ్లేషించింది.

also read సోషల్ మీడియా స్టార్టప్ కంపెనీలో ఆనంద్ మహీంద్రా భారీ పెట్టుబడి.. ...

మారటోరియం ముగిసిన తర్వాత కూడా కొంత మంది రుణగ్రహీతలు వాయిదాలు చెల్లించలేకపోవచ్చని, ఇది వారి స్కోర్లపై ప్రభావం చూపుతుందని, డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలు పెరుగుతాయని సిబిల్‌ వివరించింది. క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే గృహ, వాహన రుణాల ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉండొచ్చని తెలిపింది.

ఇదిలా ఉంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎఈ) జూన్​ 1 నుంచి 9 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంకులు రూ.12,200.65 కోట్ల రుణాలు అందించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్​ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక లభ్యత పథకం కింద ఈ రుణాలు ఇచ్చినట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. 

ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా..కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు 'ఆత్మ నిర్భర్​ భారత్​' పేరుతో కేంద్రం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద రూ.3 లక్షలు కేటాయించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు జూన్‌ 1 నుంచి జూన్‌ 9 వరకు రూ.24,260.65 కోట్ల రూపాయలను మంజూరు చేశాయి. ఇందులో రూ.12,200.65 కోట్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ఎంఎస్​ఎంఈలకు రుణాల మంజూరులో రూ.2,637 కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. రూ.2,547 కోట్ల రుణాల మంజూరుతో ఉత్తర్​ప్రదేశ్​ రెండో స్థానంలో ఉంది. ఎస్​బీఐ అత్యధికంగా రూ.13,363 కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.1,893 కోట్లు), యూనియన్​ బ్యాంక్ (రూ.1,842 కోట్లు), పంజాబ్​ నేషనల్​ బ్యాంక్ (రూ.1,772 కోట్లు) ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios