Asianet News TeluguAsianet News Telugu

కేంద్రానికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం.. చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఒప్పందం..

కరోనా ‘లాక్‌డౌన్’తో దెబ్బ తిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు 750 మిలియన్ల డాలర్లు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. 
 

Government  World Bank ink USD 750 million agreement for MSME Emergency Response Programme
Author
Hyderabad, First Published Jul 7, 2020, 1:11 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రించడం కోసం విధించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయాన్ని ప్రకటించింది. వాటికి ద్రవ్య లభ్యత లభించేందుకు సుమారు రూ. 5,670 కోట్లు (750 మిలియన్ డాలర్లు) పైగా సహకారం అందించే ఒప్పందంపై సంతకం చేసింది.

ఈ ఒప్పందంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే, ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జునైద్ అహ్మద్ సంతకం చేశారు.

ప్రస్తుత సంక్షోభంనుంచి తట్టుకోవడంతోపాటు లక్షల మంది ఉద్యోగాలను రక్షించడంలోనూ, తక్షణ ద్రవ్య లభ‍్యత, ఇతర రుణ అవసరాల నిమిత్తం 15 లక్షల సంస్థలకు ఇది సాయపడుతుందని తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఇబ్బందులనుంచి గట్టెక్కించడానికి అవసరమైన చర్యల్లో ఇది తొలి అడుగు అని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

మహమ్మారి ఎంఎస్ఎంఈ  రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఫలితంగా జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే చెప్పారు. సంక్షోభం నుండి బయటపడేందుకు ఎంఎస్ఎంఈ రుణ ప్రణాళికను ప్రకటించామని చెప్పారు. జునైద్ అహ్మద్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ  రంగం భారతదేశం  వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా ఉందని పేర్కొన్నారు.  

also read కస్టమర్లకు ఎస్‌బి‌ఐ షాకింగ్ న్యూస్: పరిమితి మించితే చార్జీల మోతే! ...

కరోనా అనంతరం ఆర్ధిక పునరుద్ధరణకు ఈ రంగానికి ద్రవ్యలభ్యత తక్షణ అవసరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే తెలిపారు. మొత్తం ఫైనాన్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రధానంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్సీబీ) రుణ సామర్థ్యాన్ని పెంచాలని, దీంతో ఎంఎస్ఎంఈ ఆర్థిక సమస్యల పరిష్కారంలో ఇవి సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయన్నారు.

కాగా కరోనా నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2.75 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించింది. వీటికి అదనంగా ప్రస్తుతం ప్రకటించిన మొత్తాన్ని ఎంఎస్ఎంఈల కోసం ఇస్తామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ లోన్ మెచ్యూరిటీ 19 ఏళ్లతో 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ కలిగి ఉంటుందని చెప్పింది.

భారతదేశ ఆరోగ్య రంగానికి తక్షణ మద్దతు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక బిలియన్‌ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించింది. అలాగే  పేదలు, బలహీన వర్గాలకు నగదు బదిలీ, ఆహార ప్రయోజనాల నిమిత్తం మే నెలలో మరో  బిలియన్ డాలర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఇది తొలిఅడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సత్వర రుణ సౌకర్యం కల్పించడంతో పాటు, వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు చేయూతనందించడమే ఈ ఒప్పందం లక్ష్యం. 

చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన అనేకమందికి తిరిగి ఉపాధి పొందేందుకు, మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపుడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios