Asianet News TeluguAsianet News Telugu

నరేశ్ గోయలే ‘కీ’:పతనం అంచుల్లో జెట్ ఎయిర్వేస్.. బెయిలౌట్ కోసం సర్కార్

ప్రైవేట్ విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ అప్పుల ఊబిలో చిక్కుకున్నది. ప్రధానంగా ప్రమోటర్ నరేశ్ గోయల్ తప్పుకునే పరిస్థితులు లేకపోవడంతో ఎతిహాద్‌ చేతులెత్తేసింది. ఎస్‌బీఐకి తన 24% వాటా అమ్మకానికి సిద్ధమైంది. అత్యధిక రుణాలిచ్చిన ఎస్బీఐకి విమాన రంగంపై అనుభవం లేదు. ఈ పరిస్థితుల్లో జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునే అవకాశాలు తక్కువే. కానీ ఎన్నికల ముంగిట జెట్ ఎయిర్వేస్ మూతపడే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్లే ఆదుకోవాలని బ్యాంకర్లపై ఒత్తిడి తెస్తోంది. జెట్ ఎయిర్వేస్  మూతబడితే 23 వేల మంది ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది. మరోవైపు ఎతిహాద్ స్థానే మరో భాగస్వామి కోసం ఖతార్ ఎయిర్వేస్ యాజమాన్యంతో నరేశ్ గోయల్ భేటీ అయినట్లు సమాచారం. 

Government wants to explore all options to keep Jet afloat
Author
Hyderabad, First Published Mar 20, 2019, 10:11 AM IST

అప్పుల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు అబుదాబీ కేంద్రంగా పని చేస్తూ సంస్థలో వాటా గల ఎతిహాద్ కూడా చేతులెత్తేయడంతో పరిస్థితి విషమించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట జెట్ ఎయిర్వేస్ సంస్థ దివాళా ప్రక్రియకు వెళ్లకముందే బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వడానికి గల అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. 

కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ సంస్థలో ప్రధాన వాటాదారులుగా బ్యాంకర్లు మరింత నిధులు సమకూరుస్తారని సంకేతాలిచ్చింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను సీనియర్ అధికారి కూడా ధ్రువీకరించారు కానీ బ్యాంకర్లు దివాళా ప్రక్రియకు వెళ్లకుండా ఉండేందుకు సిద్ధంగా లేరన్నారు. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) రూ.1900 కోట్ల నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. 

మరోవైపు బ్యాంకర్లు ఇన్నర్ క్రెడిట్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల దివాళా ప్రక్రియకు వెళ్లకుండా నిలువరించే అవకాశాలు ఉన్నాయి. అయితే సంస్థ ప్రమోటర్‌గా నరేశ్ గోయల్ తన వాటాలను తగ్గించుకునేదాన్ని బట్టి బ్యాంకర్లు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వాధికారి తేల్చేశారు. 

వాటా తగ్గించుకునేందుకు నరేశ్ గోయల్ ముందుకు వస్తే, ఇతర సంస్థల నుంచి నిధుల సమీకరణకు గల అవకాశాలను బ్యాంకర్లు పరిశీలించనున్నాయి. గోటిచుట్టూ రోకటిపోటులా జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి బయటకు వెళ్లాలని భాగస్వామి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ నిర్ణయించుకుంది.

రుణ భారం, నగదు లభ్యత సమస్యలతో సతమతం అవుతూ, సత్వరం రూ.750 కోట్లు సమకూర్చకపోతే మరిన్ని కష్టాలు తప్పవని ఎతిహాద్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ ఈ నెల మొదటివారంలో లేఖ రాశారు. రుణ పరిష్కార ప్రణాళికనూ వివరించారు. 

జెట్ ఎయిర్వేస్ చైర్మన్ లేఖపై ప్రతిస్పందించకపోగా ఎతిహాద్ తమకున్న 24 శాతం వాటాను రూ.400 కోట్లకే అమ్మేస్తామని ప్రతిపాదించింది. తమ వాటా కొనుగోలు చేసుకోమని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ను ఎతిహాద్‌ కోరింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడితే, అందులో పనిచేస్తున్న 23 వేల మంది సిబ్బందికి కష్టాలు తప్పకపోవడంతోపాటు, దేశీయ విమానయాన రంగ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుంది. ఎన్నికల ముందు ఈ ఉపద్రవ నివారణకు జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం బ్యాంకర్లపై ఒత్తిడి తెస్తోందని సమాచారం.

పాతికేళ్ల చరిత్ర ఉన్న, పూర్తిస్థాయి విమానయాన సేవల సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణాలు రూ.8,200 కోట్లకు పైగా చేరాయి. బకాయిల వాటాలు, ఉద్యోగులకు వేతనాలు బకాయి పడగా, డిబెంచర్లకు వడ్డీ కూడా చెల్లించలేకపోతున్నట్లు వరుసగా మూడోసారి సంస్థ ప్రకటించింది. 

లీజుదార్లకు అద్దె చెల్లించలేక ఉన్న 119 విమానాల్లో 50 వరకు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేది లేదని ఎతిహాద్‌ తేల్చి చెప్పింది. అంతేకాదు జెట్‌ ఎయిర్‌వేస్‌లో తన 24 శాతంను రాయితీ ధర రూ.400 కోట్లకు విక్రయిస్తామని, కొనుగోలు చేసుకోమని జెట్‌ ఎయిర్‌వేస్‌కు అధికంగా రుణాలిచ్చిన ఎస్‌బీఐని ఎతిహాద్‌ మంగళవారం కోరింది. 

డిస్కౌంట్ ధరకు తమ వాటాలను విక్రయిస్తామని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌కు ఎతిహాద్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) టోనీ డగ్లస్‌ వెల్లడించినట్లు సమాచారం. ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ పరిష్కార ప్రణాళికకు అంగీకరించకపోతే, భాగస్వామ్యం నుంచి తప్పుకోవచ్చని బ్యాంకర్లు సూచించిన మీదట’ ఎతిహాద్‌ ఈ నిర్ణయం తీసుకుందనీ చెబుతున్నారు.

ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్ విలువ రూ.229 ఉండగా, రూ.150కే అమ్మేస్తామని ఎతిహాద్‌ పేర్కొంది. అంటే.. జెట్‌ ఎయిర్‌వేస్‌ మార్కెట్‌ విలువ రూ.1,800 కోట్లు మాత్రమే. జెట్‌ ప్రివిలేజ్‌లో ఉన్న 50.1 శాతం వాటాను కూడా అమ్మేందుకు సిద్ధమని బ్యాంకులకు తెలిపింది.

ఇప్పటికిప్పుడు సంస్థను అమ్మేస్తే ఇచ్చిన రుణాల్లో నాలుగోవంతు కూడా రాని పరిస్థితి బ్యాంకులకు ఏర్పడుతుంది. హెచ్‌ఎస్‌బీసీ వద్ద జెట్‌ ఎయిర్‌వేస్‌ తీసుకున్న 140 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.965 కోట్లు) రుణానికి పూచీకత్తు ఇవ్వాలని ఎస్‌బీఐని కోరింది. ఈ రుణానికి సంబంధించి ఈనెల 11న 31 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉండగా, జెట్‌ ఎయిర్‌వేస్‌ తీర్చలేదు. ఈనెల 28న మరో 109 మిలియన్‌ డాలర్లు కట్టాలి. ఎతిహాద్‌ ప్రకటనతో ఇది కూడా కష్టమేనన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో రోజూ  123 విమానాలు 600 సర్వీసులు నడిపేవి. కానీ ప్రస్తుతం
విమానాలు మాత్రమే సేవలందిస్తున్నాయి.  ఎతిహాద్‌ వంటి విమానయాన సంస్థ తప్పుకుంటే, జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ మరింత కష్టమవుతుంది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యాపారంలో బ్యాంకులకు అనుభవం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 

గత డిసెంబర్ నెలలోనే రుణాలు చెల్లించలేకపోవడంతో, దివాలా స్మృతి కింద జెట్ ఎయిర్వేస్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు చేరాల్సి ఉంది. ఈ దుస్థితి నివారించాలంటే మరో భాగస్వామిని 15 రోజుల్లోగా జెట్‌ ఎయిర్‌వేస్‌ అన్వేషించాల్సి ఉంది. 

ఇందుకే జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌, ఆయన కుమారుడు నివాన్‌ గోయల్‌ కలిసి దోహా వెళ్లి, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ గ్లోబల్‌ సీఈఓ అక్బర్‌ ఆల్‌ బాకర్‌ను కలిసినట్లు సమాచారం. ఎతిహాద్ ప్రత్యర్థి సంస్థ అయినా తాజా పరిస్థితులు పూర్తిగా అధ్యయనం చేయకుండా ఖతార్ ఎయిర్వేస్ ప్రతిస్పందిస్తుందా? అన్నదీ అనుమానమే.

జెట్‌ ఎయిర్‌వేస్‌ అధిక సంఖ్యలో విమానాలు నిలిపివేయడం, సర్వీసులు రద్దు చేయడంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని తన సెక్రటరీని పౌర విమానయాన మంత్రి సురేశ్‌ ప్రభు కోరారు. ముందస్తు బుకింగ్‌లు, రిఫండ్‌లు, భద్రతా అంశాలపైనా డీజీసీఏ నుంచి పూర్తి నివేదిక తెప్పించాలని ఆదేశించారు.

పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ నెలాఖరుకు తగిన చర్యలు చేపడతామని డీజీసీఏ పేర్కొంది. మున్ముందు జెట్‌ విమానాలు మరింత తగ్గుతాయనే అంచనాను వ్యక్తం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రధాన వాటాదార్లు తమ షేర్లను పూచీకత్తుగా తనఖా పెడితే, బ్యాంకులు మరిన్ని రుణాలు సమకూర్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. సంస్థలో ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ కుటుంబానికి 52 శాతం, ఎతిహాద్‌కు 24 శాతం వాటాలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios