న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభంలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన కేంద్రం తాజాగా  మరో 20- 25 విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్నది. విదేశీ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. రెండోదశలో విమానాశ్రయాల ప్రైవేటీకరణలో భాగంగా 25 ఎయిర్‌పోర్టులను గుర్తించినట్లు భారత విమానాశ్రయాల సంస్థ (ఎఎఐ) చైర్మన్ గురుప్రసాద్ మోహపాత్ర శుక్రవారం తెలిపారు.

ఫిబ్రవరిలో నిర్వహించిన ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీకరణలో ఆదానీ గ్రూపు బిడ్డింగ్‌లో పాల్గొని ఆరు ఎయిర్‌పోర్ట్‌లను చేజిక్కించుకున్నది. వీటిలో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహాటిలు ఉన్నాయి. ‘ఇప్పటికే ఆరు ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటీకరించాం. రెండో విడుతలో భాగంగా మరో 20 నుంచి 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని అనుకుంటున్నాం’ అని మోహాపాత్రా విలేకరులతో చెప్పారు. 


ఏయే విమానాశ్రయాలను ప్రైవేటీకరించేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఏఏఐ వీటి పేర్లను ప్రకటించనున్నదని భారత విమానాశ్రయాల సంస్థ (ఎఎఐ) చైర్మన్ గురుప్రసాద్ మోహపాత్ర తెలిపారు. వార్షికంగా 15 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలను చేర్చే విమానాశ్రయాలను ఇందుకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.

తాము ఎంపిక చేసిన విమానాశ్రయాల జాబితాను ఆ తర్వాత పౌర విమానయాన మంత్రిత్వశాఖకు సిఫారసు చేయనున్నట్లు భారత విమానాశ్రయాల సంస్థ (ఎఎఐ) చైర్మన్ గురుప్రసాద్ మోహపాత్ర సూచనప్రాయంగా చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది.

సీనియర్ ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా మోహాపాత్ర కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ)కి బదిలీ అయ్యారు. ఆయన వచ్చేనెల ఒకటో తేదీన  డీపీఐఐటీ సెక్రటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ప్రైవేటీకరించ తలపెట్టిన విమానాశ్రయాలను గుర్తించడానికి కన్సల్టెన్సీ‌ని ఏర్పాటు చేసినట్లు, వారిచ్చిన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. రెండోసారి నిర్వహించబోతున్న బిడ్డింగ్‌లో ఏ సంస్థయైన పాల్గొనవచ్చని, తొలి రౌండ్ వేలం విజయవంతం కావడంతో రెండోదఫాపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. 


డుబ్లిన్, మునిచ్ విమానాశ్రయాలకోసం ప్రైవే ట్ సంస్థలు పోటీపడే అవకాశాలు ఉన్నాయని భారత విమానాశ్రయాల సంస్థ (ఎఎఐ) చైర్మన్ గురుప్రసాద్ మోహపాత్ర అన్నారు. గతేడాది నవంబర్‌లోనే ఈ ఆరు ఎయిర్‌పోర్ట్‌లను పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్దతిన ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో నిర్వహించిన బిడ్డింగ్‌లో ఆదానీ గ్రూపు ఈ ఆరింటిని దక్కించుకున్నది. వీటికి కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది.