Asianet News TeluguAsianet News Telugu

అచ్చం ‘సత్యం’ లాగే: సర్కార్ ‘ఐఎల్ఎఫ్ఎస్’ టేకోవర్

ఐఎల్ఎఫ్ఎస్ పదేళ్ల క్రితం ‘సత్యం కంప్యూటర్స్’ కుంభకోణాన్ని స్ఫురణకు తెస్తున్నది. నాడు సత్యం రామలింగరాజు లేని లాభాలు ఉన్నట్లు చూపి మదుపర్లను మభ్య పెడితే.. ఐఎల్ఎఫ్ఎస్ ఇష్టం వచ్చినట్లు రుణాలిచ్చి చతికిల పడింది. ఈ నేపథ్యంలో నాటి సత్యం కంప్యూటర్స్ మాదిరిగానే ఐఎల్ఎఫ్ఎస్ ను స్వాధీనం చేసుకున్నది. 

Government Takes Over Debt-Ridden IL&FS, Uday Kotak On New Board
Author
Delhi, First Published Oct 2, 2018, 8:13 AM IST

సరిగ్గా పదేళ్ల క్రితం.. 2008లో ‘సత్యం’ రామ లింగరాజు సంస్థలో లాభాలు పెంచి చూపామని ప్రకటించారు. పరిస్థితిని చక్కదిద్దాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. అన్నింటికి తానే బాధ్యుడినని పోలీసుల ముందు లొంగిపోయారు.

అంతర్జాతీయ ఐటీ దిగ్గజంగా పేరొందిన ‘సత్యం’ కంప్యూటర్స్ సంస్థను గాడిలో పెట్టేందుకు దాన్ని కేంద్రం స్వాధీనం చేసుకుంది. తదుపరి టెక్ మహీంద్రాకు అప్పగించింది. తాజాగా రూ.90 వేల కోట్ల మేరకు రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వ్యవహారం ‘సత్యం’ కుంభకోణాన్ని గుర్తుకు తెస్తోంది.

ప్రస్తుతం ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ మాదిరిగానే ఆనాడు సత్యం కంప్యూటర్స్‌ అనూహ్యంగా సంక్షోభంలో కూరుకుపోయింది. కాకపోతే రెంటికీ  ప్రాథమిక తేడా ఉంది. సత్యం ప్రమోటర్లు సంస్థ  ఆదాయాలు, లాభాలను ఎక్కువ చేసి చూపి స్టాక్‌మార్కెట్‌ మదుపరులను మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఇబ్బందుల పాలయితే, ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారం అప్పులు చేసి  వాటిని తిరిగి చెల్లించలేక చిక్కుల్లో పడిన సంస్థ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌. 

2008లో మాదిరిగానే కేంద్రం రంగంలోకి దిగి ‘సత్యం కంప్యూటర్స్’ను రక్షించటానికి అనుసరించిన మార్గాన్నే ఈసారీ ఎంచుకుంది. నాడు సత్యం కంప్యూటర్స్ నామినేటెడ్ చైర్మన్‌గా ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్‌ను నియమించినట్లు ఐఎల్ఎఫ్ఎస్ కోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బోర్డును కేంద్రం నామినేట్ చేసింది.

ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ను కేంద్రం టేకోవర్ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. కేంద్రం నామినేట్ చేసిన బోర్డుకు ఉదయ్ కోటక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పక్షపాతం లేకుండా కంపెనీ వ్యవహారాల నిర్వహణకు ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌‌ను పునర్‌వ్యవస్థీకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్సీఎల్టీ ఆమోదించింది. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌డైరెక్టర్లు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారనీ, కంపెనీ కుప్పకూలితే మ్యూచువల్ ఫండ్లు కూడా కూడా భారీగా నష్టపోతాయని ప్రభుత్వం పేర్కొంది. 

బోర్డులో ఉదయ్ కోటక్‌తో‌పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా టెక్ మహీంద్రా వినీత్ నయ్యర్, సెబీ ఛైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్, ఐసిఐసిఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ జీ సీ చతుర్వేది, ఐఏఎస్ అధికారి మాలినీ శంక‌ర్, రిటైర్డ్ అధికారి నంద్‌కిశోర్‌ సభ్యులుగా ఉంటారని ఆర్థికశాఖ ఒక ప్రకటనతో తెలిపింది. కొత్త బోర్డు వెంటనే బాధ్యతలను స్వీకరిస్తుందని తెలిపింది. కొత్త వెనువెంటనే పునరుద్దరణకు ప్రణాళికను రూపొందిస్తుందని పేర్కొంది. 

అక్టోబర్ 8 లోగా బోర్డు సమావేశం అయి అక్టోబర్ 31 లోగా కంపెనీ పునరుద్ధరణకు ప్రణాళికను సమర్పించాల్సిందిగా కేంద్రానికి ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌తోపాటు అనుబంధ కంపెనీలు సిడ్బికీ రూ. 91,000 కోట్ల మేర రుణపడి ఉన్నాయి. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ లాంటి కంపెనీ డిఫాల్ట్ అయితే ఫైనాన్షియల్ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలను వ్యక్తం అవుతున్నాయి. 

ఆరుగురు ప్రభుత్వ నామినీలు ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ బోర్డును టేకోవర్ చేయడానికి ఎన్సీఎల్టీ జడ్జీలు ఎంకే ష్రావత్, రవికుమార్ దురైస్వామిఆమోదిస్తూ, సస్పెండైన డైరెక్టర్లు ఇక నుంచి కంపెనీకి ప్రాతినిధ్యం వహించరాదని పేర్కొన్నారు.

దేశ ఆర్థికవ్యవస్థ మీ ప్రభావం చూపేఅంశం కనుక జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ఎన్సీఎల్టీకి నివేదించింది. ఇప్పటికే కంపెనీ వ్యవహారాలపై ఎస్‌ఎఫ్‌ఐఓతో విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. గతంలో సత్యం కంప్యూటర్స్ సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకున్న సంగతిని గుర్తు చేసింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ఇకముందు డిఫాల్డ్‌ కాకుండా చూస్తామని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో విశ్వాసం నింపడం కోసం టేకోవర్ చేయక తప్పలేదని, ఆర్థికసంస్థలు లిక్విడిటీని కల్పిస్తాయన్న ఆశాభావంతో ఉన్నట్టు ఆర్థికశాఖ పేర్కొంది. కాగా ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌లో ఆర్థిక సంస్థలు మదుపు చేయడాన్ని రాహుల్ గాంధీ స్కామ్‌గా పేర్కొనడం ఆయన పెడబుద్దికి నిదర్శనమని అర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ విమర్శించారు. 

1987లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50.5 శాతం వాటాతోనూ, యుటీఐ 30.5 శాతం వాటాతో ఏర్పాటు చేయడం కూడా స్కామ్ అవుతుందా అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. 2005 లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో 15 శాతం వాటాను ఎల్‌ఐసీ తీసుకోవడం కూడా స్కామ్ అవుతుందా అని ఆయన ప్రశ్నించారు.

ఆ తర్వాత 2006లో మరో 11.10 శాతం వాటాను కూడా ఎల్‌ఐసీ తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2010 లో కూడా ఎల్‌ఐసీ మరో 19.34 లక్షల షేర్లను కొనుగోలు చేసిందని అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఎల్‌ఐసీ చేసిన ఈ పెట్టుబడులు కూడా స్కామ్‌లు అవుతాయా అని అరుణ్‌జైట్లీ ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios