IDBI బ్యాంకులో తన వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధం అవుతోంది.  ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EoI) పద్ధతిలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం  సిద్ధంగా ఉంది.  IDBI బ్యాంక్  డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద, ప్రభుత్వం దాని మొత్తం 45.48 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. 

వచ్చే నెలాఖరులోగా IDBI బ్యాంక్‌లో వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ కీలక అధికారి వ్యాఖ్యలు చేశారు. వాటాల విక్రయానికి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EoI) పద్ధతిలో వాటాల విక్రయం చేపట్టనుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం IDBI బ్యాంక్ నియంత్రణ LIC చేతిలో ఉంది. IDBI బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద, ప్రభుత్వం దాని మొత్తం 45.48 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. 

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా, ప్రభుత్వం దాదాపు 26 శాతం వాటాలతో పాటు ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కంపెనీ నిర్వహణ నియంత్రణను కూడా విక్రయించవచ్చని సీనియర్ అధికారి తెలిపారు. 8,27,590,885 అదనపు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసిన తర్వాత, జనవరి 21, 2019 నుండి IDBI బ్యాంక్ LICకి అనుబంధంగా మారింది. 

IDBI బ్యాంక్‌లో LIC వాటా 19 డిసెంబర్ 2020న 49.24 శాతానికి తగ్గిన తర్వాత ఇది మరోసారి అసోసియేట్ కంపెనీగా మారింది. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయం జరుగుతోందని, అందులో చాలా అంశాలు పూర్తయ్యాయని సంబంధిత అధికారి తెలిపారు. వచ్చే నెలాఖరు లేదా మేలో ఈ డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EoI)ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

ఇది కాకుండా, ఈ పెట్టుబడుల ఉపసంహరణను సజావుగా పూర్తి చేయడానికి ఫైనాన్స్ యాక్ట్ 2021 ద్వారా IDBI బ్యాంక్ చట్టంలో కూడా మార్పులు చేశామని, ఈ పెట్టుబడి కోసం సలహాదారులను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు.

IPO తీసుకురావడానికి సిద్ధమవుతున్న LIC, IDBI బ్యాంక్‌లో తన వాటాలో కొంత భాగాన్ని నిలుపుకోవాలని యోచిస్తోందని, తద్వారా ఈ బ్యాక్ అస్యూరెన్స్ ఛానెల్ ప్రయోజనాన్ని పొందవచ్చని చూస్తోంది. 

LIC IPOపై కేంద్రం ప్లాన్స్ ఇవే..
మే నెలలోనే అతిపెద్ద బీమా కంపెనీ LIC మెగా ఐపీఓను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత మే నెల నాటికి సద్దుమణిగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

నిబంధనల ప్రకారం, ఐపిఓ కోసం సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) ఎంబెడెడ్ విలువ మే వరకు చెల్లుబాటులో ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. అంతకు మించి ఆలస్యం జరిగితే ఎల్‌ఐసీ ఎంబెడెడ్ విలువను మళ్లీ లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. బీమా కంపెనీలు పొందుపరిచిన విలువ ఆధారంగా విలువను నిర్ణయిస్తాయి.

నిజానికి IPO మార్చి చివరి నాటికి ప్రారంభించనుందని గతంలో వార్తలు వచ్చాయి. పెరుగుతున్న బడ్జెట్ లోటును తీర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలనేది, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో కీలక అంశంగా ఉంది. ఈ నెల ప్రారంభంలో ప్రచురించిన బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్ సెంటిమెంట్ క్షీణించింది, దేశం యొక్క అతిపెద్ద IPO వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయవలసి వచ్చింది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందించలేదు.