LIC IPO గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మే 12లోగా ఐపీవోను ప్రైమరీ మార్కెట్లో ప్రవేశ పెట్టాల్సి ఉంటుందని, సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. లేకపోతే సెబీకి మరోసారి అప్ డేట్ చేసిన డ్రాఫ్ట్ పేపర్స్ ను దరఖాస్తు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఈ సంవత్సరం భారీగా ఆశలు పెట్టుకున్న LIC IPO గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే ఎల్ఐసీ ఐపీఓకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC IPO) ఐపిఓను తీసుకురావడానికి ప్రభుత్వానికి మే 12 వరకు మాత్రమే సమయం ఉంది. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 

మే 12లోగా LIC IPOని తీసుకురాలేకపోతే, డిసెంబరు ఫలితాలతో పాటు తాజాపరిచిన ఎంబెడెడ్‌ వాల్యూని పేర్కొంటూ మరోసారి డ్రాఫ్ట్ పేపర్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, డ్రాఫ్ట్ పత్రాలను కూడా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే LIC IPO మార్చిలో ప్రారంభించేందుకు కేంద్రం అన్ని రకాలుగా సంసిద్ధం అవుతోంది. అయితే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఐపీవో వాయిదా పడింది. LIC ఫిబ్రవరి 13, 2022న SEBIకి IPO యొక్క ముసాయిదా పత్రాలను సమర్పించగా, ఇఫ్పటికే మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదించింది

కాగా సెబీకి దాఖలు చేసిన పత్రాల ఆధారంగా ఐపీఓ తీసుకురావడానికి మే 12 వరకు సమయం ఉంది. సెప్టెంబర్ 2021 నాటి LIC ఆర్థిక ఫలితాలలో పొందుపరిచిన విలువ ఆధారంగా SEBIకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశారు. డిఆర్‌హెచ్‌పి ప్రకారం, LIC బీమా కంపెనీలో 100 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వ కలిగి ఉంది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను రూ.10 ముఖ విలువతో ప్రభుత్వం విక్రయించనుంది.

ఈ IPO అనంతరం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.63,000 కోట్ల వరకు వచ్చి చేరతాయని మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.

ఇదిలా ఉంటే ఎంబెడెడ్ వేల్యూ ను ఈవీ అని పేర్కొంటారు. ఇది ఒక సాధారణ వాల్యుయేషన్ పద్ధతి. కంపెనీ షేర్ హోల్డర్ల కన్సాలిడేటెడ్ వేల్యూ ను లెక్కించేందుకు ఎబెడెడ్ వేల్యూ పద్ధతి ద్వారా కనుగొంటారు. భవిష్యత్ లాభాల ప్రస్తుత విలువ (ప్రెజంట్ వేల్యూ ఆఫ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ )కు కంపెనీ కాపిటల్ నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ) ను జోడించి, సర్ ప్లస్ ను కూడా కలపడం ద్వారా ఎంబెడెడ్ వేల్యూ ను పొందవచ్చు. 

అంతర్జాతీయ వాల్యుయేషన్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ LIC ఎంబెడెడ్ విలువను లెక్కించింది. సంస్థ అంచనా ప్రకారం, 30 సెప్టెంబర్ 2021 నాటికి కంపెనీ ఎంబెడెడ్ విలువ రూ. 5.4 లక్షల కోట్లు. ఎంబెడెడ్ విలువలో LIC మార్కెట్ వాల్యుయేషన్ వెల్లడించలేదు. 

సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న 30-40 రోజుల తర్వాత సెబీ ఆమోదం తెలుపుతుంది. కానీ, ఎల్ఐసీ ఐపీఓ విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ 22 రోజుల్లో ఆమోదం తెలపడం విశేషం.