న్యూఢిల్లీ: మార్కెట్‌లో ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వాటి ఎగుమతిపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఉల్లిగడ్డలను ఎగుమతి చేయరాదంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి గడ్డల ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.60-80 మధ్య పలుకుతున్నది. ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరదల వల్ల పంట దెబ్బ తిన్నది. దీంతో ఉల్లిగడ్డల సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

దీనిని తమకు అనువుగా మలుచుకునేందుకు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ఉల్లిధరలు పెంచేస్తున్నారు. మరికొందరు విదేశాలకు ఉల్లిగడ్డలను ఎగుమతి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉల్లిగడ్డల ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని రకాల ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది. దేశీయంగా రిటైల్‌ వ్యాపారులు, టోకు వ్యాపారుల వద్ద నిల్వల పరిమితిపైనా ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయాలు తక్షణం అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా నిర్ణయం ప్రకారం టోకు వ్యాపారుల వద్ద 500 క్వింటాళ్లు, రిటైల్‌ వ్యాపారుల వద్ద 100 క్వింటాళ్లు మాత్రమే నిల్వ ఉండాలని పేర్కొంటూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ ఆదేశాలు జారీచేసింది.

కృత్రిమ కొరతను నివారించి, బహిరంగ మార్కెట్‌లో ఉల్లిగడ్డల ధరలు పెరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తాజాగా కేంద్రం జారీ చేసిన నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవడంతోపాటు అనైతికంగా నిల్వలు కొనసాగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం వద్ద గల నిల్వల నుంచి 50 వేల టన్నుల ఉల్లిగడ్డలను బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేసింది. కేంద్ర నిల్వల నుంచి తమ అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కోరారు.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మదర్‌ డైరీ, నాఫెడ్‌, ఎన్సీసీఎఫ్‌ సంస్థల ఔట్‌లెట్లు రూ.23.90లకే కిలో ఉల్లి గడ్డలను వినియోగదారులకు విక్రయిస్తున్నాయి. పంజాబ్‌ ప్రభుత్వం కూడా కిలో ఉల్లి గడ్డలను రూ.35లకే వినియోగదారులకు విక్రయిస్తున్నది.

ఆగస్టులోనే ధరలను తగ్గించి, వినియోగదారులకు ఉల్లి అందుబాటులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టన్ను ఉల్లి గడ్డలను రూ.59,932 (850 డాలర్ల) కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)కి ఎగుమతి చేయాలని ఈ నెల 13న డీజీఎఫ్‌టీ ఆంక్షలు విధించింది.

దీని ప్రకారం కొంత మేరకు ఎగుమతులు తగ్గినా.. ఆగడం లేదు. బంగ్లాదేశ్‌, శ్రీలంకలకు ‘ఎంఈపీ’కే ఉల్లిగడ్డలు అధిక మొత్తంలో ఎగుమతి చేస్తున్నారని నివేదికలు రావడంతో తక్షణం ఎగుమతులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.