న్యూఢిల్లీ: సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ భారతదేశంలో భారీ పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించింది. వచ్చే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో భారత్‌లో రూ. 75వేల కోట్లు వెచ్చిస్తామని గూగుల్‌ సోమవారం తెలిపింది. గూగుల్‌ వెచ్చించే భారత డిజిటలీకరణ నిధిని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానని ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా వర్చువల్‌ ఈవెంట్‌’లో గూగుల్‌, అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. 

తాము ప్రకటించిన పెట్టుబడులను ఈక్విటీల్లోనూ, జాయింట్ వెంచర్స్, నిర్వహణ వంటి వివిధ రూపాల్లో సమకూరుస్తామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. భారత్‌ భవితవ్యం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై తమకున్న నిదర్శనానికి ఈ భారీ పెట్టుబడులే నిదర్శనమని అన్నారు. 

భారత డిజిటలీకరణలో కీలకమైన నాలుగు రంగాల్లో ఈ పెట్టుబడులు దృష్టిసారిస్తాయని సుందర్ పిచాయ్ చెప్పారు. ప్రతి భారతీయుడకి తన సొంత భాషలో సమాచారాన్ని చేరవేయడం, భారత్‌ అవసరాలకు అనువైన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని తెలిపారు.

also read ముకేశ్ అంబానీ మనసులో ఏముంది? వరుస పెట్టుబడులపై గుడ్ న్యూస్ చెబుతారా? ...

పరిశ్రమలు డిజిటల్‌ బాట పట్టేలా సహకరించడం, సామాజిక ప్రయోజనాలకు వైద్య, విద్యం, సేద్యం వంటి రంగాల్లో ఆటోమేషన్‌ ఇంటెలిజెన్స్‌ అమలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను వెచ్చిస్తామని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్‌ ఇండియా విజన్‌ను సుందర్‌ పిచాయ్‌ ప్రశంసిస్తూ ఆన్‌లైన్‌ వేదికలో భారత్‌ గొప్ప పురోగతి సాధించిందని ప్రస్తుతించారు. 

డిజిటల్‌ కనెక్టివిటీకి లోతైన పునాదులు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని సుందర్ పిచాయ్ వెల్లడించారు. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం, డేటా ధరల తగ్గింపు, అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను కల్పించడం వల్ల నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందని అన్నారు.

2004లో గూగుల్‌ హైదరాబాద్‌, బెంగళూర్‌ నగరాల్లో కార్యాలయాలను ప్రారంభించిన సందర్భంలో భారతీయ యూజర్లకు మెరుగైన సెర్చ్‌ సేవలను అందించడంపైనే ఫోకస్‌ చేశామని చెప్పారు.