బంగారం ధర మార్చి నెలలో పెరగడం ప్రారంభించింది. మార్చి 2న ఏకంగా బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 475 పెరిగింది.
దేశవ్యాప్తంగా పసిడి ధరలు పుంజుకున్నాయి దీంతో పసిడి ప్రేమికులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఒకే రోజు బంగారం ధర రూ.500 పెరిగింది. ఫలితంగా బంగారం షాపింగ్ చేసే వారి జేబుపై భారం పెరిగింది. గురువారం దేశ రాజధానిలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.475 పెరిగి రూ.55,955కి చేరుకున్నాయి.హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సమాచారం ప్రకారం. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 55,480 వద్ద ముగిసింది. అయితే కిలో వెండి రూ.1,225 తగ్గి రూ.63,825 వద్ద ముగిసింది.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, ఢిల్లీలో స్పాట్ బంగారం ధరలు 10 గ్రాములకు రూ.475 పెరిగి రూ.55,955కి చేరుకున్నాయన్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,833 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి కూడా స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 21.04 డాలర్లుగా ట్రేడవుతోంది. "డాలర్ విలువ తగ్గడంతో బుధవారం ఆసియా ట్రేడింగ్ గంటలలో బంగారం ఔన్స్‌కి 1,830 పైన బంగారం పెరిగింది అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు.
అంతర్జాతీయంగా గమనించినట్లయితే, డాలర్ పతనం అవటం కూడా బంగారం ధర పెరగటానికి కారణం అయ్యిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బంగారానికి డాలర్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. డాలర్ ఎంత బలపడితే బంగారం ధర అంత తగ్గుతుంది. అదే డాలర్ ఎంత బలహీనపడితే బంగారం ధర కూడా అంత పెరుగుతుంది. ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే, బంగారం ధర రికార్డు స్థాయికి పెరిగింది. ముఖ్యంగా బంగారం ధర గరిష్ట రికార్డు అయినటువంటి రూ. 58 వేల వరకు టచ్ చేసింది.
అక్కడి నుంచి ఫిబ్రవరి నెలలో బంగారం ధర వరుసగా పతనం అవుతూ వస్తుంది. ఏకంగా గరిష్ట స్థాయి నుంచి 3500 వరకు పడిపోయింది. అక్కడి నుంచి బంగారం ధర మరింత పడుతుందని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా షాకు కొట్టినట్లుగా బంగారం ధర పెరగటం ప్రారంభించింది. మార్చి నెల మొదటి రోజే బంగారం ధర పెరుగుదల ప్రారంభించగా, మార్చి రెండవ తేదీన బంగారం ధర ఏకంగా 475 రూపాయలు పెరిగి పసిడి మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది.
