బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యుల ఆశలు ఆవిరైపోతున్నాయి. రోజు రోజుకీ బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. మొన్నామధ్య వరకు పదిగ్రాముల బంగారం 35వేలు ఉండేది. ఒక్కసారిగా అంతర్జాతీయ ప్రమాణాలు, మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం ధర భారీగా పెరిగింది. తాజాగా తులం బంగారం రూ.40వేలకు చేరింది. 

సోమవారం నాటి మార్కెట్లో ముంబయిలో బంగారం ధర రూ.40వేలు దాటింది. వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే రూ 41,000 దాటుతాయని జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ బచ్‌రాజ్‌ బమాల్వా చెప్పారు. 

పసిడి ధరలు పైపైకి ఎగబాకినా పండుగ సీజన్‌తో పాటు రాబోయే  పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో డిమాండ్‌పై పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని, పాత బంగారం రీసైక్లింగ్‌ పెరిగిందని ముంబై జ్యూవెలర్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌ శెట్టి చెప్పారు. ఇక దీపావళి నాటికి పదిగ్రాముల పసిడి రూ 41,000కు చేరుతుందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.